వైసీపీ రెబల్ ఎంపీ రఘురామరాజుకు, వైసీపీ నేతలు, శ్రేణులకు నడుమ కోల్డ్ వార్ నడుస్తూనే ఉంది. రఘురామరాజు చేసే విమర్శలకు, ఆరోపణలకు వైసీపీ నేతలు ఉక్కిరిబిక్కరి అవుతున్నారు. ముఖ్యమంత్రి తీసుకుంటున్న చాలా నిర్ణయాలను, కీలక నేతల తీరును రఘురామరాజు తీవ్రంగా తప్పుబడుతూ రచ్చబండ పేరుతో ఢిల్లీ నుండి మీడియాలో హల్చల్ చేస్తూ వస్తున్నారు. మొదట్లోకి ఆయన మీద గట్టిగానే రియాక్ట్ అయ్యారు లీడర్లు. నరసాపురం లోక్ సభ పరిధిలోని ఎమ్మెల్యేలే ఆయన మీద విరుచుకుపడ్డారు. దిష్టి బొమ్మలు దగ్ధం చేశారు. ఆ తర్వాత ఫైట్ పెద్దది కావడం అధిష్టానం ఆయన మీద అనర్హత వేటు వేయాలని లోక్ సభ స్పీఎకర్ ఓంబిర్లాను కోరడం, అదింకా పరిశీలనలో ఉండటం జరిగింది.
అయితే ఢిల్లీలో మాత్రం రఘురామరాజు మీద అనర్హత వేటు వేసే వాతావరణం ఏదీ కనబడట్లేదు. ఇది వైసీపీ శ్రేణులకు అసహనాన్ని తెప్పించింది, ఆ అసహనం కాస్త కోపంగా మారింది. దీంతో సోషల్ మీడియాలో ఆయన మీద యుద్ధం మొదలైంది. విగ్గు వివాదం, బార్ ఫోటోలకు వరకు వెళ్ళిపోయింది గొడవ. తాజాగా రఘురామరాజు బైపాస్ సర్జరీ చేయించుకున్నారు. శస్త్ర చికిత్స ముంబైలో విజయవంతంగా జరిగింది. ఆయన ఆసుపత్రిలో కోలుకుంటూ ఉండగా మూడు రోజుల క్రితం ఆపరేషన్ చేయించుకున్న రఘురామరాజుకు తీవ్ర అస్వస్థత కలిగిందని, మెరుగైన వైద్యం కోసం ఆయన్ను సింగపూర్ తరలించారని, పరిస్థితి చాలా సీరియస్ అయిందనే ప్రచారం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున జరిగింది. దీంతో రఘురామారాజు సీరియస్ అయ్యారు. ఉన్నపళంగా సోషల్ మీడియాలో ప్రత్యక్షమై వైసీపీ శ్రేణుల మీద విరుచుకుపడ్డారు.
అంతటితో ఆయన కోపం తగ్గలేదు. పూర్తిగా కోలుకున్న ఆయన ఈరోజు ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయి హైదరాబాద్ బయలుదేరారు. డిశ్చార్జ్ అయ్యే ముందు మళ్ళీ సోషల్ మీడియాలోకి వచ్చిన ఆయన తాను పూర్తి ఆరోగ్యంతో ఉన్నానని, ఎలాంటి ఇబ్బందీ లేదని, ఉత్సాహంగా ఇంటికి వస్తున్నానని, చెప్పాలంటే రెట్టింపు ఉత్సాహంతో వస్తున్నానని అన్నారు. ఆయన మాటలు వింటే యుద్దానికి సిద్ధం కమ్మని శత్రు సేనకు తెలియపరచినట్టే ఉంది. అంతేకాదు తాను కోలుకోవాలని ప్రార్థించిన ప్రతిఒక్కరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నానని, తన కోసం బాధపడిన వారికి కూడ ధన్యవాదాలు చెబుతూ ఇన్నిరోజులు మీరు పడిన బాధ చాలు… నేను వచ్చేస్తున్నాను అంటూ అపోజిషన్ బ్యాచ్ కి మ్యాచ్ రెస్యూమ్ చేసుకోండి అన్న భావనలో మెసేజ్ ఇచ్చారు. కరెక్టుగా చూస్తే ఆయన తనమంచి కోరిన వారికి కృతజ్ఞలు చెబుతూనే శత్రువులకు కాచుకోమని వార్నింగ్ ఇచ్చినట్టు ఉంది. ఆయన ఊపు చూస్తుంటే రచ్చబండ కార్యక్రమాన్ని గతం కంటే రెట్టింపు రీతిలో నిర్వహించేలా ఉన్నారు.