వైసీపీలో మొట్ట మొదటగా లేచిన అసమ్మతి స్వరం ఎంపీ రఘురామకృష్ణరాజుదే. చిన్న చిన్నగా అధిష్టానం మీద విమర్శలు స్టార్ట్ చేసిన ఆయన మెల్లగా దాన్ని యుద్ధంలా మార్చేశారు. ఒకానొక దశలో ముఖ్యమంత్రి జగన్ తీసుకునే ప్రతి నిర్ణయాన్ని తప్పుబడుతూ వచ్చారు. ఇప్పటికీ అదే చేస్తున్నారనుకోండి. ఢిల్లీలో కూర్చొని రచ్చబండ పేరుతో వైసీపీని రచ్చకీడుస్తున్నారు. మొదట్లో మౌనంగానే ఉన్న వైసీపీ నేతలు ఆ తర్వాత రివర్స్ అటాక్ మొదలుపెట్టారు. అది కాస్త వారి మీదకే రివర్స్ అయింది. వైసీపీ ముఖ్య నేతలు ఎప్పుడైతే కలుగజేసుకోవడం స్టార్ట్ చేశారో అప్పటి నుండి రఘురామరాజు హీరో అయ్యారు. సొంత పార్టీ ఎంపీయే ఆరోపణలు చేస్తుండటంతో జనం ఆలోచనలో పడ్డారు. రామకృష్ణరాజు మాటల్లోని లాజిక్స్ పట్టుకోవడం స్టార్ట్ చేశారు. ఆయన అడిగే దాంట్లో అర్థం ఉంది కదా మరెందుకు సమాధానం చెప్పకుండా ఆయన్ను తిడుతున్నారు అంటూ జనమే ప్రశ్నించడం మొదలెట్టారు.
దీంతో సీన్ అర్థమైన వైసీపీ కెలుక్కుంటే మనమే కంపు అవుతామని సైలెంట్ అయిపోయింది. మొదట్లో రఘురామరాజు మీద వీర లెవల్లో విమర్శలు చేసిన వైసీపీ నేతలు ఇప్పుడు కనీసం నోరు కూడ మెదపట్లేదు. అసలు ఆయన ఊసే వినిపించకూడని డిసైడ్ అయినట్టున్నారు. పైగా ఢిల్లీ లెవల్లో రెబల్ ఎంపీ మీద అనర్హత వేటు వేయించాలనే ప్రయత్నాన్ని కూడ తాత్కాలికంగా నిలిపివేసినట్టు కనిపిస్తున్నారు. ఇక పాలక పార్టీ అనుకూల మీడియా కూడ మౌనం వహించడం స్టార్ట్ చేసింది. ఎక్కడా ఆయన పేరు ఎత్తడంలేదు. ఈ చర్యలన్నీ రాష్ట్ర స్థాయిలో బాగానే పనిచేశాయి. ఇంతకుముందు రఘురామరాజు గురించి కథలుకథలుగా మాట్లాడుకున్న జనం ఇప్పుడు పెద్దగా మాట్లాడుకోవట్లేదు. ఈ రకంగా వైసీపీ వ్యూహం రాష్ట్రంలో రఘురామరాజు మూలాన పార్టీకి జరుగుతున్న నష్టాన్ని కొంత తగ్గించగలిగింది.
కానీ జాతీయ స్థాయిలో జరుగుతున్నా నష్టాన్ని మాత్రం ఆపలేకపోతోంది. ఒక ఎంపీ కొన్ని నెలలుగా ఢిల్లీకే పరిమితమై రోజూ ప్రెస్ మీట్ పెట్టి సొంత పార్టీని తప్పుబడుతూ రావడంతో జాతీయ మీడియా దృష్టిని ఆకర్షించింది. ప్రతిరోజూ కాకపోయినా కొంచెం తరచుగానే ఆయన మాటలకు కవరేజ్ ఇస్తున్నారు. ఎంపీ ఎత్తి చూపుతున్న తప్పులను విశ్లేషిస్తున్నారు. ఇక జాతీయ స్థాయిలో రామరాజు పలుకుబడి గురించి చెప్పాల్సిన పనిలేదు. ఆ పలుకుబడితోనే జాతీయ మీడియా సంస్థలను తనవైపు తిప్పుకుంటున్నారు. రాష్ట్రంలో ఎలాగూ కవరేజ్ లేదు కాబట్టి నేషనల్ లెవల్లో చూసుకుందాం అన్నట్టు వ్యవహరిస్తున్నారు. మరి వెనకున్న గొయ్యిని తప్పించుకున్నామనుకున్న వైసీపీ ముందున్న నుయ్యిని ఎలా దాటుతుందో చూడాలి.