జనసేన టిక్కెట్టుని ఆశిస్తున్న వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ.?

వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు, 2024 ఎన్నికల్లో బీజేపీ నుంచి పోటీ చేస్తారనీ, టీడీపీ నుంచి టిక్కెట్ ఆశిస్తున్నారనీ.. ఇలా రకరకాల ప్రచారాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారనే విషయమై ఇప్పటిదాకా రఘురామ ఎలాంటి స్పష్టతా ఇవ్వలేదు.

2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి నర్సాపురం ఎంపీగా గెలిచారు రఘురామకృష్ణరాజు. ఆ తర్వాత ఆయన టీడీపీకి దగ్గరయ్యారు. జనసేన పార్టీతోనూ సఖ్యతతోనే మెలుగుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో వున్న ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో, రఘురామ సొంత నియోజకవర్గానికి సైతం వెళ్ళలేకపోతున్నారు చాలాకాలంగా.

ఇంకోపక్క, రఘురామతో సన్నిహిత సంబంధాలున్నా, బయటపడటంలేదు వైసీపీలోని కొందరు రఘురామ సానుభూతిపరులు. ఎన్నికలు సమీపిస్తున్న దరిమిలా, ఆయా నేతలతో రఘురామ టచ్‌లోకి వెళుతున్నారట. వైసీపీ నుంచి జనసేనలోకి దూకెయ్యమంటూ రఘురామ, తనకు అత్యంత సన్నిహితులైన వైసీపీ నేతలకు సూచిస్తున్నారట.

2024 ఎన్నికల్లో టీడీపీ – జనసేన కలిసి పోటీ చేయనున్న సంగతి తెలిసిందే. బీజేపీ కూడా ఈ కూటమితో కలవొచ్చని రఘురామ భావిస్తున్నారు. అయితే, బీజేపీ లేదా టీడీపీ నుంచి పోటీ చేయడం కంటే, జనసేన నుంచి పోటీ చేస్తే మంచి రిజల్ట్ వస్తుందని రఘురామ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల తర్వాత, హైద్రాబాద్‌లో పవన్ కళ్యాణ్‌తో రఘురామ భేటీ అవుతారట. రఘురామ గనుక జనసేనలోకి వెళితే, నాగబాబు నర్సాపురం కాకుండా, కాకినాడ నుంచి పోటీ చేసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.

రఘురామ టీడీపీ నుంచి పోటీ చేసినా, బీజేపీ నుంచి పోటీ చేసినా.. నర్సాపురం సీటు జనసేన తరఫున ఖాళీగానే వుంటుంది. ఎందుకంటే, బీజేపీ ఎలాగూ జనసేనకు మిత్రపక్షమే. టీడీపీ కూడా అంతే.