నరసాపురం రెంబల్ ఎంపీ రఘురామకృష్ణమరాజుపై వైకాపా అదిష్టానం అనర్హత వేటుకు రంగం సిద్దం చేసిన సంగతి తెలిసిందే. ఈ రోజు మధ్నాహ్నం పలువురు వైకాపా ఎంపీలు లోక్ సభ స్పీకర్ ఓంబీర్లాతో సమావేశం కానున్నారు. అనంతరం రఘురాం వ్యవహారాన్ని స్పీకర్ దృష్టికి తీసుకెళ్లనున్నారు. స్పీకర్ కు ప్రత్యేకంగా ఓ లేఖ కూడా సమర్పించనున్నారు. ఇప్పటికే ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి రఘురాంపై అనర్హతవేటు వేస్తున్నామని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక ఢిల్లీ టూర్ తో వేటు తధ్యమని తేలిపోయింది. ఈ నేపథ్యంలో రఘురాం శుక్రవారం హైకోర్టును ఆశ్రయించారు. తనపై అనర్హత వేటు, సస్పెన్షన్ చర్యలు అడ్డుకోవాలని పిటీషన్ దాఖలు చేసారు.
తాను పార్టీకి వ్యతిరేకంగా ఎలాంటి వ్యాఖ్యలుగానీ, చర్యలకుగానీ పాల్పడలేదని పిటీషన్ లో పేర్కొన్నారు. యువజన రైతు శ్రామిక పార్టీ తరుపున తాను ఎన్నికయ్యానని, కానీ తనకు వైకాపా పార్టీ లెటర్ హెడ్ పై షోకాజ్ నోటీస్ వచ్చిందని పిటీషన్ లో వెల్లడించా రు. ఈ విషయాన్ని ఇప్పటికే ఈసీ దృస్టికి తీసుకెళ్లినట్లు, ఈసీ నిర్ణయం తీసుకునే వరకూ తనపై ఎలాంటి చర్యలు తీసుకోకూడదని పిటీషన్ లో పేర్కొన్నారు. కరోనా నేపథ్యంలో ప్రస్తుతం హైకోర్టు అత్యవసర పిటీషన్లపైనే విచారణ చేపడుతోంది. ఈ నేపథ్యంలో రఘురాం పిటీషన్ సోమవారం విచారణకు వచ్చే అవకాశం ఉందని సమాచారం. రఘురాం రెండు నాల్కల ధోరణితో వ్యవరిస్తున్నట్లు కనబడుతోంది.
మీడియా సమావేశాల్లో వైకాపా పై ఆరోపణలు, విమర్శలు చేస్తూనే, మరో వైపు పదవిని కాపాడుకునే ప్రయత్నాన్ని చేస్తున్నారు. ఈ క్రమంలో మాటల మార్చి లేఖలు రావడం, హైకోర్టును ఆశ్రయించడం వంటి చర్యలు సహేతుకంగా లేవంటూ రాజకీయ నిపుణులు విశ్లేషిస్తున్నారు. షోకాజ్ నోటీసుపై సెటైర్లు వేసిన ఎంపీ ఇప్పుడు అదే నోటీసు కు భయపడుతున్నారని తెలుస్తోంది. ఇప్పటివరకూ ఈ వ్యవహారమంతా సీఎం జగన్ కు తెలియదంటూ చెప్పుకొచ్చిన రఘురాం ఇప్పుడు ఆయన కనుసన్నాల్లోనే ఇదంతా జరుగుతుంటూ తాజాగా ఆరోపించడం ఆసక్తికరం.