జగన్ కు బెయిల్ వచ్చి పదేళ్లు… ఆర్.ఆర్.ఆర్. వెటకారం అలా ఉంది!

గతకొంతకాలంగా స్వపక్షంలో విపక్షం అనే పదానికి న్యాయం చేస్తూ రాజకీయం చేస్తున్నారు వైసీపీ రెబల్ ఎంపీ కనుమూరి రఘురామ కృష్ణంరాజు! అధికార వైసీపీని, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ని టీడీపీ, జనసేన నేతల కంటే ఎక్కువగా రఘురామ కృష్ణంరాజే విమర్శించారన్నా అతిశయోక్తి కాదేమో. రచ్చబండ అనే ఒక కార్యక్రమం పెట్టి రఘురామ కృష్ణంరాజు క్రియేట్ చేసిన రాజకీయ “రచ్చ” అంతా ఇంతా కాదని అంటారు.

ఆ సంగతి అలా ఉంటే… ప్రస్తుతం చంద్రబాబుతో బహిరంగంగా చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నట్లు కనిపిస్తున్న రఘురామకృష్ణంరాజు… బాబు ఢిల్లీ వెళ్తే టీడీపీ ఎంపీల కంటే ముందే అటెండెన్స్ వేయించుకుంటున్నారనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ సమయంలో ఆర్.ఆర్.ఆర్. వెటకారం పీక్స్ కి చేరినట్లుగా ఉంది. ఇందులో భాగంగా ఆయన ఒక కేక్ ముందు పెట్టుకుని కూర్చున్న ఒక ఫోటో ఇప్పుడు వైరల్ అవుతుంది.

అవును… తాజాగా రఘురామ కృష్ణంరాజు ఒక వార్షికోత్సవ కార్యక్రమం జరుపుకున్నారు. అదేమిటంటే… జగన్ కు బెయిల్‌ వచ్చి నేటితో పదేళ్లు అయ్యిందనంట. ఈ మేరకు ఈ వార్షికోత్సవ కార్యక్రమంలో “హ్యాపీ టెన్ త్ ఏనివర్సరీ” అని ఉన్న కేక్ కోసి సెలబ్రేట్ చేసుకున్నారు. దానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఇప్పుడు వైరల్ గా మారూతున్నాయి.

కాగా ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏపీ సీఎం వైఎస్ జగన్‌ మే 27, 2012న అరెస్టై 2013 సెప్టెంబర్ 24న జైలు నుండి విడుదలయ్యారు. ఇందులో భాగంగా జగన్‌ కు ప్రత్యేక కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. మరోపక్క స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో అరెస్టైన టీడీపీ అధినేత చంద్రబాబు ప్రస్తుతం సీఐడీ కస్టడీలో ఉన్న సంగతి తెలిసిందే.