వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు స్వపక్షంలో విపక్షంలా మారిన వైనం అందరికీ తెలుసు. వైసీపీ ప్రత్యర్థులేమో ఆయన మాట్లాడేవన్నీ నిజాలే కదా అంటూ ఆయనకు సపోర్ట్ చేస్తుంటే వైసీపీ శ్రేణులు మాత్రం దుమ్మెత్తిపోస్తున్నాయి. ఎవరి అభిప్రాయం ఏలా ఉన్నా రఘురామరాజు మాత్రం తాను చేస్తున్నదే రైట్ అని, తన వాదం కోసం ఎంత దూరమైనా వెళ్తానని అంటున్నారు. ఈ మాటల యుద్ధంలో అప్పుడప్పుడు సవాళ్లు కూడా విసురుకున్నారు. జగన్ బొమ్మ మీద ఎంపీ అయి ఇప్పుడు ఆయన్నే విమర్శిస్తున్నావా, నీకు రాజకీయ భిక్ష పెట్టిందే జగన్ అంటూ వైసీపీ నేతలు అంటుంటే రఘురామరాజు మాత్రం తానెవరి దయతోనూ గెలవలేదని అంటున్నారు.
కావాలంటే రాజీనామా చేసి ఉప ఎన్నికలకు వెళ్దామని అన్నారు. అయితే అవి అమరావతికి రెఫరెండం అని, తన చేతిలో ఓడిపోతే జగన్ అమరావతినే శాశ్వత రాజధానిగా గుర్తించాలని, ఒకవేళ తాను ఓడిపోతే జనం మూడు రాజధానులను కోరుకుంటున్నట్టేనని కండిషన్ పెట్టారు. వైసీపీ నుండి ఈ సవాలుకు సమాధానం రాలేదు. కాబట్టి తానే గెలిచానని, వైసీపీ తన సవాలుకు భయపడి ఉప ఎన్నికకు జంకిందని, ఇప్పటికీ రాజీనామా చేసి ఉప ఎన్నికల్లో దిగడానికి తాను సిద్ధమని దర్జాగా చెప్పుకుంటున్నారు రాజుగారు.
ఒకవేళ అమరావతి నినాదం మీద గెలవగలనని రాజుగారు నిజంగా అంత ధీమాగా ఉన్నట్టు అయితే త్వరలో తిరుపతి లోక్ సభ స్థానానికి ఉప ఎన్నికలు జరగనున్నాయి. రఘురామరాజు నరసాపురంలో రాజీనామా చేసేసి తిరుపతి బరిలో నిలిచి గెలిచి తానే కరెక్ట్ అని ప్రూవ్ చేసుకోవచ్చు కదా. ఆయన రాజీనామాను ఎవ్వరూ ఆపరు. పైగా అక్కడ గెలిస్తే జనం అమరావతినే రాజధానిగా కావాలని కోరుకుంటున్నట్టు ప్రూవ్ అవుతుంది కూడ. అంటే ఒకే తూటాకు రెండు పిట్టలన్నమాట. పైగా పులివెందులలో పదివేల మందితో మీటింగ్ పెట్టగలనని, తనను ఎవ్వరూ ఆపలేరని గతంలో తొడలుకొట్టి ఉన్నారు ఆయన.
కనుక అందివచ్చిన ఈ ఉప ఎన్నికల అవకాశాన్ని వాడుకుని తన దమ్ము, పలుకుబడి, తాను చెబుతున్నట్టు రాష్ట్ర ప్రజలు అమరావతికే కట్టుబడి ఉన్నారని, గెలవడానికి తనకు ఎవరి దయా అక్కర్లేదని, గత ఎన్నికల్లో జగన్ బొమ్మ మీద గెలవలేదని చాటుకోవచ్చు కదా. మరి ఈ ఆలోచన రాజుగారికి వచ్చింది లేదో.