తెలుగు సినిమా రంగంలోని హీరోలు, ఇతర నటీనటులు వైఎస్ జగన్ పాలన మీద ప్రశంసలు కురిపించడం చాలా తక్కువ. ఏదో కొన్ని సందర్భాల్లో తప్ప వారు జగన్ గురించి మాట్లాలేదు. అది కూడ కొద్దిమంది మాత్రమే. 2019 ఎన్నికలు హోరాహోరీగా జరుగుతున్న సమయంలో కూడ పెద్ద సినిమా తారలు ఎవరూ ఏపీ రాజకీయాలు గురించి, పార్టీలు, నాయకుల గురించి మాట్లాడింది లేదు. ఏది హాస్యనటుడు పృథ్వీ, పోసాని కృష్ణ మురళి, చిన్నా చితకా ఆర్టిస్టులు తప్ప జగన్ కు సపోర్ట్ చేసిన వారు ఎవరూ లేరు. నిజానికి స్టార్లు ఎవ్వరూ ఎవ్వరికీ మద్దతు తెలపలేదు. కానీ తెలంగాణ రాజకీయ పట్ల మాత్రం మనవాళ్ళు చాలా యాక్టివ్. నిత్యం కేసీఆర్, కేటీఆర్ ఇద్దరి మీద ప్రశంసల జల్లులు కురిపిస్తూనే ఉంటారు. అలా వైసీపీకి, జగన్ కు సినీ గ్లామర్ టచ్ తక్కువే.
అయితే ఈమధ్య ఒక ప్రముఖ స్టార్ మాత్రం వైఎస్ జగన్ ను తెగ పొగిడేస్తున్నారు. ఆయనే రెడ్ స్టార్ ఆర్.నారాయణమూర్తి. నారాయణమూర్తి వ్యక్తిత్వం ఎలాంటిదో అందరికీ తెలుసు. నిరాడంబరంగా జీవించే వ్యక్తి. వామపక్ష భావజాలాలు మెండుగా ఉన్న మనిషి. బడుగు బలహీన వర్గాల కోసమే సినిమా కళను వినియోగించిన వ్యక్తి. హీరోలు, నిర్మాతలు, దర్శకులు కమర్షియల్ అంటూ డబ్బు వెనుక పరిగెడుతుంటే నారాయణమూర్తి మాత్రం ప్రజల కష్టాల వెనుక పడ్డారు. రైతుల కష్టాలను ప్రభుత్వాలను, ప్రజలకు ఎలుగెత్తి చెప్పేవారు. హీరోగా, దర్శకుడిగా కూడ వరుస సినిమాలు చేసి బోలెడంత క్రేజ్ సొంతం చేసుకున్నారు. ఒకానొక దశలో ఆయనకు రాజకీయాల్లోకి ఆహ్వానం అందడం, ఎమ్మెల్యే టికెట్ ఆఫర్ వెళ్లడం జరిగాయి. అయినా ఆయన రాజకీయాల జోలికి వెళ్ళలేదు. పదవులు, పేరు కాదు ప్రజా సమస్యలే ముఖ్యం అనేవారు.
అలాంటి వ్యక్తి ఇప్పుడు రాజకీయాల మీద ఆసక్తిగా ఉన్నారు. ఏనాడూ ఏ నాయకుడినీ పొగడని రీతిలో ఇప్పుడు వైఎస్ జగన్ ను ప్రశంసిస్తున్నారు. దేశంలోని ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్న వ్యక్తి సీఎం జగన్ అని ఆయన కొనియాడారు. జగన్ పాలనలో ఉత్తరాంధ్ర మరింతగా అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇన్నాళ్లు విశాఖపట్నం, తూర్పుగోదావరి సరిహద్దులోని మెట్ట ప్రాంతాల్లో ఒక పంట పండటమే కష్టంగా ఉండేదని, ఏలేరు, తాండవ రిజర్వాయర్లు ఉన్నా పరిస్థితిలో ఎటువంటి మార్పు రాలేదని, ఈ సమస్యలను గుర్తించిన వైఎస్ జగన్ ఏలేరు నీటిని తాండవకు అనుసంధానం చేసి భవిష్యత్తులో సాగునీటికి ఇబ్బంది లేకుండా చేశారని కొనియాడారు.
జగన్ కు తన మద్దతు ఎల్లప్పుడూ ఉంటుందని ప్రకటించారు. ఈ మాటలు మాట్లాడిని వేరొక స్టార్ హీరోనో, నటుడో అయితే పెద్దగా పట్టించుకోవాల్సిన పని లేదు కానీ నారాయణమూర్తి లాంటి ప్రజాశ్రేయస్సు కాంక్ష ఉన్న వ్యక్తి మాట్లాడారంటే మంచి విషయమనే అనాలి. రెడ్ స్టార్ మాటలను విన్న చాలామంది జనం ఆయనలాంటి వ్యక్తి రాజకీయాల్లో అందులోనూ వైసీపీలో ఉంటే బాగుంటుందని, ఆయనే పార్టీలో చేరితే జగన్ మంచి ప్రాముఖ్యత ఇస్తారని మాట్లాడుతున్నారు. మరి రెడ్ స్టార్ జగన్ కు తన మద్దతును బయటి నుండే కాకుండా పార్టీలో చేరి కూడ ఇస్తారేమో చూడాలి.