అలీ మొదటి నుంచీ జనసేనలో చేరతారని ప్రచారం జరిగింది. అప్పట్లో పవన్‌తో కలిసి నెల్లూరులో జరిగిన రొట్టెల పండుగకు వెళ్లడంతో.. జనసేన తరపున పోటీ చేస్తారని ఊహాగానాలు రెట్టింపు అయ్యాయి. పవన్ కళ్యాణ్ అలీ చాలా క్లోజ్ కావడంతో ఆయన జనసేనలో చేరడం ఖాయమని అభిమానులు ప్రచారం చేసేసారు.
దీనితో పవన్ అభిమానులు కంగుతిని సోషల్ మీడియాలో అలీ చేసింది నమ్మక ద్రోహమంటూ విరుచుకు పడ్డారు. మరి ఈ విషయమై పవన్ ఏం కామెంట్ చేస్తారు అనేది ఎదురుచూస్తున్న అంశం. అయితే తాజాగా పవన్ ఈ విషయమై మాట్లాడారు. తనకు మంచి మిత్రుడైన అలీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడంపై పవన్ తనదైన శైలిలో స్పందించారు.
“యాక్టర్స్, పాపులారిటీ డిఫరెంట్ అన్న ఆయన.. ఎక్కడికి వెళ్లాలనేది అలీ ఛాయిస్. జగన్ బలమైన నాయకులు అని అలీకి అనిపించి ఉండొచ్చు. టీడీపీ పదవి ఇవ్వకపోవడం కూడా కారణం కావచ్చు” అని పవన్ కళ్యాణ్ తెలిపారు.
అలాగే జనసేన పార్టీ తరఫున చిరంజీవి ప్రచారం చేసే అవకాశం లేదని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. రాజకీయాలను అన్నయ్య, నేను వేరు వేర్వేరు కోణాల్లో చూస్తామని పవన్ తెలిపారు. ఆ విషయం మా ఇద్దరికీ తెలుసన్నారు.
ఇక జనసేన తరఫున నటులెవరూ ప్రచారం చేయకపోవడానికి కారణమేంటో నాకు తెలీదు. కానీ నాకంటే ప్రజాకర్షణ ఉన్న నటులున్నారు. కానీ నేను యాక్టర్ల మీద ఆధారపడను. రాజకీయ సిద్ధాంతాల మీద ఆధారపడతానని పవన్ కళ్యాణ్ తెలిపారు.
స్టార్ డమ్ అనేది జనాలు రావడం వరకే పని చేస్తుంది. కానీ మాట్లాడాల్సింది మనమే. రాజకీయ అవగాహన, భావజాలం, విధాన నిర్ణయాలపై అవగాహన ఉండాలి. ప్రజాదరణ ఉన్న వ్యక్తికి ఏం మాట్లాడాలనే విషయాలపై అవగాహన ఉండాలని పవన్ కళ్యాణ్ తెలిపారు.