అంతర్వేది లక్ష్మీనరసింహాస్వామి రధం దగ్థం ఘటన తెలుగు రాష్ర్టాల్లో సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఇదంతా పక్కా ప్లాన్ ప్రకారమే జరిగిందని ప్రతిపక్షం తీవ్రస్థాయిలో ఆరోపించింది. ఈ నేపథ్యంలో అధికార పక్షం-ప్రతి పక్షం నేతల మధ్య మరోసారి మాటల యుద్ధం ముదిరింది. అన్యమత ప్రచారంలో భాగంగానే రధాన్ని అధికార పార్టీ నేతలు దగ్ధం చేసారంటూ ఆరోపించారు. దీనికి ప్రతిగా వైసీపీ నేతలు అదే స్థాయిలో మండిపడ్డారు. తాజాగా ఈ వ్యవహారంలోకి పరిపూర్ణ నంద స్వామి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేసారు. హిందువులకు జరుగుతోన్న అన్యాయంపై జగన్ కచ్చితంగా స్పందించాల్సిందేనని అన్నారు.
ఘటనపై రోడ్డెక్కి నిరసనలు తెలియజేస్తుంటే అన్యాయంగా అరెస్ట్ లు చేస్తారా? అని మండిపడ్డారు. జనం నమ్మి ఓట్లస్తే ఇలాంటి ఘాతుకాలకు పాల్పడతారా? ఆలయాలపై ఇలాంటి ఉన్మాద చర్యలేంటి? రధం దగ్థం వెనుక పెద్ద కుట్ర దాగి ఉంది..దగ్ధం చేసిన వాళ్ల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేయాలి. ఇలాంటి విషయాన్ని వదిలేస్తే హిందు మతమే లేకుండా పోతుందేమోనన్న భయమేస్తుందని ఆవేదన చెందారు. ఏడాది కాలంగా హిందు దేవాలయాలపై జరుగుతోన్న దాడులు చూస్తుంటే ఎలాంటి పరిస్థితులకు దారి తీస్తుందో అర్ధం కావడం లేదున్నారు. వీటన్నింటికి జగన్ మోహన్ రెడ్డి సరైన వివరణ ఇవ్వాలని విజ్ఞప్తి చేసారు.
అలాగే ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు కూడా అనుమానం వ్యక్తం చేసారు. ఇది ప్రమాదవశాత్తు జరిగిందా? కావాలని చేసారా? అన్నది నిగ్గు తేల్చాలన్నారు. పథకం ప్రకారమే దాడులు జరుగుతున్నాయని అభిప్రాయపడ్డారు. ఓమత ప్రచార వ్యాప్తిలో భాగంగానే ఇవన్నీ చోటు చేసుకుంటున్నట్లు అనుమానం వ్యక్తం చేసారు. ఇప్పటికే తిరుపతి కొండపై అన్యమత ప్రచారానికి తెరలేపినట్లు గతంలో పెద్ద ఎత్తున ప్రభుత్వంపై విమర్శలు వెల్లు వెత్తున సంగతి తెలిసిందే. తాజా ఘటనతో రాష్ర్టంలో వాతావరణం మరింత వేడెక్కుతోంది.