బీజేపీ ≤ నోటా: పురందేశ్వరికి అల్టిమేట్టం… తప్పించుకోలేరా?

ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా ఎన్నికైన దగ్గుబాటి పురందేశ్వరి గతకొన్ని రోజులుగా దూకుడు ప్రదర్శిస్తోన్న సంగతి తెలిసిందే. ఇంతకాలం స్తబ్ధగా ఉన్నట్లు కనిపించిన బీజేపీ నాయకుల్లో కదలికలు తీసుకొచ్చే ప్రయత్నంలో ఉన్నారని తెలుస్తోంది. ఈ సందర్భంగా ఏపీ అధికారపక్షంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు పురందేశ్వరి.

ఈ సమయంలో పురందేశ్వరి పై వైసీపీ నేతలు కూడా అదేస్థాయిలో రిటార్ట్ ఇచ్చేస్తున్నారు. మాటకు మాట బదులిస్తున్నారు. ఈ సమయంలో పురందేశ్వరి ఒక పార్టీలో ఉంటూ మరో పార్టీ కోసం పనిచేస్తున్నారన్నట్లుగా కామెంట్ చేశారు వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి. ట్విట్టర్ వేదికగా చేసిన ఈ కామెంట్ వైరల్ గా మారింది. పురందేశ్వరి.. చంద్రబాబు క్షేమం కోసం పరితపిస్తోందా అనే మాటలు వినిపిస్తోన్నాయి.

ఇదే సమయంలో తాజాగా మంత్రి రోజా కూడా స్పందించారు. బీజేపీ కేంద్రమంత్రులు చెప్పిన విషయాలను కూడా పరిగణలోకి తీసుకోకుందా… చంద్రబాబు చేసిన విమర్శలనే పురందేశ్వరి కూడా చేస్తున్నారంటూ ఫైరయ్యారు. పురందేశ్వరి తీరు చూస్తుంటే… ఆమె ఏపీ బీజేపీ అధ్యక్షురాలా.. లేక, టీడీపీ అధ్యక్షురాలా అనే విషయం అర్ధంకావడం లేదని అన్నారు. అనంతరం… పురందేశ్వరి వ్యవహారం చూస్తుంటే చంద్రబాబుని సీఎం చేయాలని పరితపిస్తున్నట్లు ఉందని అనేశారు.

రాజకీయ విమర్శల సంగతి అలా ఉంటే… విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు.. దాన్ని అమ్ముతామంటే కుదరదు చిన్నమ్మా అంటూ విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం పోరాటం చేస్తున్న అఖిలపక్షం స్ట్రాంగ్ గానే హెచ్చరించింది. ఈ విషయంలో బీజేపీని, ఆ పార్టీ నాయకులను కనిపించిన ప్రతీచోటా ప్రశ్నిస్తామన్నట్లుగా వ్యాఖ్యానించింది.

ఉక్కు పెట్టుబడులు ఉపసంహరణ కేంద్రం విధాన నిర్ణయం అంటూ ఏపీ బీజేపీ ప్రెసిడెంట్ హోదాలో దగ్గుబాటి పురంధేశ్వరి విశాఖ ప్రెస్ మీట్ లో కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. దీనికి కౌంటర్ గా అఖిపక్ష నాయకులు విశాఖ బాగు అంటే ఉక్కు పరిరక్షణ తప్ప మరోటి కానే కాదని స్పష్టం చేశారు. ఇదే సమయంలో ఉక్కుని ప్రైవేట్ పరం చేశాక ఇక ఉద్యోగుల సంక్షేమం కోసం చూసేది చేసేది ఏముంటుంది అని ప్రశ్నించారు.

ఈ సందర్భంగా విభజన హామీలూ నేరవేర్చలేదు… ఇదే సమయంలో విశాఖ అభివృద్ధికి బీజేపీ ప్రభుత్వం ఏ విధంగానూ ఉపయోగపడలేదని అఖిలపక్ష నేతలు మండిపడ్డారు. విశాఖ రైల్వే జోన్ ని ఆలాగే ఉంచారని.. విశాఖ ఉక్కుని అమ్మకానికి పెడుతున్నారని.. గంగవరం పోర్టుని అదానీకి ఇచ్చేశారని.. ఇన్ని చేసి విశాఖ మీద ప్రేమ ఉంది అంటే ప్రజలు ఎందుకు నమ్ముతారు అని ఫైర్ అయ్యారు.

ఇదే సమయంలో మరింత డోస్ పెంచిన అఖిలపక్ష నేతలు… విశాఖకు ఆర్ధిక పునాదులుగా ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను అన్నింటినీ బీజేపీ అంబానీ, అదానీలకు కట్టబెడుతూ విద్వంసానికి పాల్పడుతోందని నిందించారు. బీజేపీ చెర నుంచి విశాఖను కాపాడుకోవాలని అఖిల పక్ష నేతలు ప్రజలకు పిలుపు ఇవ్వడం విశేషం. దీంతో పరోక్షంగా పురందేశ్వరికి ఇచ్చి పడేశారు అఖిలపక్ష నేతలు.

దీంతో బీజేపీ చీఫ్ గా ఎవరు మారినా.. ఎంత హడావిడి చేసినా.. విశాఖ ఉక్కు విషయంలో క్లారిటీ లేనంత కాలం, ఆంధ్రుల హక్కును వారినుంచి దూరం చేయాలనే ఆలోచన వారి మదిలో ఉన్నాంత కాలం… ఏపీలో బీజేపీ పరిస్థితి “లెస్ దేన్ ఆర్ ఈక్వల్ టూ నోటా (బీజేపీ ≤ నోటా) అని అంటున్నారు పరిశీలకులు.