జగన్ కి మద్దతుగా పురందేశ్వరి సంచలన వ్యాఖ్యలు

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై జరిగిన దాడి ఘటన రాష్ట్రంలో తీవ్ర కలకలం రేపింది. రాజకీయ వర్గాల్లో ఈ ఘటన తీవ్ర చర్చలకు దరి తీసింది. టిడిపి ప్రభుత్వం ఇది బీజేపీ, వైసీపీ కలిసి ఆడుతున్న డ్రామాగా పరిగణిస్తుంటే… వైసీపీ శ్రేణులు మాత్రం ఇది ముమ్మాటికీ అధికార ప్రభుత్వం కుట్ర అంటూ ఎదురు దాడికి దిగాయి. ఇక బీజేపీ నేతలు కూడా టిడిపి పైన విమర్శల దాడి చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ నేత పురంధేశ్వరి టిడిపి పై సంచలన వ్యాఖ్యలు చేసారు. ఆమె ఏమన్నారో కింద ఉంది చదవండి.

పురందేశ్వరి బుధవారం మీడియాతో మాట్లాడుతూ… ఏపీ అధికార టిడిపి ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసారు. ప్రతిపక్ష నాయకుడు జగన్ పై దాడి జరిగితే…కత్తి అంగుళం దిగిందా? అరంగుళం దిగిందా? అంటూ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించిన తీరు సరైనది కాదని వ్యాఖ్యానించారు. జగన్ పై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను అన్నారు. ఏపీలో శాంతిభద్రతలు కరువయ్యాయి అన్నారు.

బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా, రాష్ట్ర బీజేపీ ప్రెసిడెంట్ కన్నా లక్ష్మి నారాయణలపై దాడి జరిగిందంటేనే రాష్ట్రంలో శాంతి భద్రతలు ఏమాత్రం అదుపులో ఉన్నాయో అర్ధం అవుతుంది అంటూ ఎద్దేవా చేసారు. జగన్ పై దాడికి పాల్పడిన వ్యక్తికి పోలీసులే మంచి వ్యక్తని సర్టిఫికెట్లు ఇస్తున్నారని విమర్శలు చేసారు. మోదీ దేశం ఎంతో కృషి చేస్తున్నారని అభినందించారు. దేశం సర్వతోముఖాభివృద్ధి సాధించే దిశగా మోదీ తోడ్పడుతున్నారన్నారు.

బీజేపీని ఓడించడం, మోదీని గద్దె దించడం ఎవరి వల్ల సాధ్యం కాదని స్పష్టం చేసారు. పరిపూర్ణానంద ఇష్టపడే బీజేపీలో చేరారని, ఎమ్మెల్యేగా, ఎంపీగా ఆయన పోటీ చేయరని పేర్కొన్నారు. పార్టీ ఎక్కడ నిర్ణయిస్తే అక్కడి నుండే పోటీ చేస్తానని పురందేశ్వరి తేల్చి చెప్పారు. ఎన్టీఆర్ జీవితం తెరచిన పుస్తకమని, ఆయన గౌరవాన్ని దిగజార్చే విధంగా బయోపిక్ లు ఉండకూడదని పురందేశ్వరి హెచ్చరించారు.