చెప్పే మాటలకూ చేసే పనులకూ పొంతన లేని రాజకీయ నాయకులు చాలా మందే ఉంటారు. ఇదే సమయంలో తమ వ్యక్తిగత కక్షను రాష్ట్రంపై చూపించాలని చూస్తుంటారు. అదేవిధంగా… అది జరగదని తెలిసినా కూడా ప్రజలను వంచించడానికి ఏమాత్రం వెనకాడరు. తాజాగా పురందేశ్వరి అలానే తయారయ్యారనే కామెంట్లు వినిపిస్తున్నాయి!
బీజేపీ ఏపీ అధ్యక్షురాలిగా బాధ్యతలు తీసుకన్న దగ్గుబాటి పురందేశ్వరి… ఆనాటి నుంచి ఏపీ ప్రభుత్వంపైనా, వైఎస్ జగన్ పైనా తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తోన్న సంగతి తెలిసిందే. అలా ఆమె ఎంత ప్రయత్నించినా… సొంత పార్టీ నేతల నుంచి, మంత్రుల నుంచీ ఎదురుదెబ్బలు తగులుతూనే ఉన్నాయి.
ఉదాహరణకు అప్పుల విషయం, ఇళ్ళ నిర్మాణాల విషయంలో ఏపీ సర్కార్ పై పురందేశ్వరి తీవ్ర విమర్శలు చేశారు. ఇదే సమయంలో ఢిల్లీ వెళ్లి సంబంధిత శాఖా మంత్రులను కలిశారు. ఫిర్యాదు చేశారు. అయితే పార్లమెంటులోనే పురందేశ్వరికి షాకిస్తూ… వివరాలు అందించారు!
ఆ సంగతి అలా ఉంటే… తాజాగా విశాఖపట్నంలో బీజేపీ నూతన కార్యవర్గం సమావేశం జరిగింది. ఆ సందర్భంగా మైకందుకున్న పురందేశ్వరి… వైజాగ్ స్టీల్ ప్లాంట్ విషయంలో తమకు చిత్తశుద్ధి ఉందని అన్నారు. ప్లాంటుతో పాటు ఉద్యోగులు, కార్మికులకు ఎలా మేలు చేయాలా అని ఆలోచిస్తున్నట్లు చెప్పుకున్నారు.
అయితే ఆమె ఇలా మాటలు చెప్పి 24 గంటలు కాకముందే ప్లాంటు రెండేళ్ళకు మించి ఉండదని స్వయంగా ఉక్కు శాఖ కార్యదర్శి ప్రకటించారు. ప్రకటించటం అంటే సభలో చెప్పటం కాదు రాతపూర్వకంగా చెప్పారు. దీంతో.. ఆయన చెప్పిన మాట, అది చెప్పిన విధానం హాట్ టాపిక్ గా మారింది.
అవును… తాజాగా ఉక్కు శాఖ కార్యదర్శి ఎస్.ఎస్. సిన్హా.. స్టీల్ ప్లాంటును సందర్శించారు. ఈ క్రమంలో అన్నీ విభాగాలను పరిశీలించిన తర్వాత విజిటర్స్ బుక్ లో సంతకం చేస్తూ ఏదో రాశారు. ఆయన వెళిపోయిన తర్వాత.. ఏమి రాశారా? అని చదివిన ఉన్నతాధికారులు స్టన్ అయిపోయారు.
విజిటర్స్ బుక్ లో ఉక్కు శాఖ కార్యదర్శి రాసిన కామెంట్ ఏమిటంటే… “విశాఖ స్టీల్ ప్లాంటు రెండేళ్ళల్లో మూతపడనుంది” అని! దీంతో అక్కడున్నవారందరూ షాక్ అయ్యారు.
అయితే పురందేశ్వరి చెప్పిన మాటలకు ఉక్కుశాఖ కార్యదర్శి రాసిందానికి పూర్తి విరుద్ధంగా ఉందని తాజాగా తేలిపోయింది. దీంతో కార్యదర్శి తాజా రాతతో పురందేశ్వరి చెప్పిందంతా అబద్ధమే అని మరోమారు తేలిపోయిందని అంటున్నారు పరిశీలకులు. దీంతో హస్తినలో ఏమి జరుగుతుందో పురందేశ్వరికి తెలియడం లేదా.. లేక, తెలిసినా కూడా ఏమార్చే పనికి పూనుకున్నారా అన్నది ఆసక్తిగా మారింది.