పృధ్వీకి జనసేన టిక్కెట్ ఖరారైనట్లేనా.?

2019 ఎన్నికల సమయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో వున్నారు సినీ నటుడు ‘థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ’ పృధ్వీ రాజ్. కానీ, ఇప్పుడాయన జనసేన మద్దతుదారుడిగా వున్నారు. ‘జనసేనలో ఇంకా చేరలేదుగానీ..’ అంటూ సన్నాయి నొక్కులు నొక్కుతుంటారు పృధ్వీ రాజ్.

రాజకీయాల్లోకి వెళ్ళి నష్టపోయిందే ఎక్కువన్నది పృధ్వీ నోట పదే పదే వినిపించే మాట. టీటీడీ ఎస్వీబీసీ ఛానల్ ఛైర్మన్‌గా గతంలో పృధ్వీ బాధ్యతలు నిర్వహించారు. అక్కడ జరిగిన ఓ అనూహ్య ఘటనతో ఆయన్ని తొలగించారు. అది కూడా, మహిళల్ని వేధించడం.. అన్న కోణంలో.

ఆ సమయంలో పృధ్వీపై తీవ్ర విమర్శలు చేసింది జనసేన. చిత్రంగా ఆ జనసేన మీదనే మమకారం పెంచుకున్నారు పృధ్వీ. అదే రాజకీయమంటే.! వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని నానా రకాలుగా తిట్టిన ధర్మాన ప్రసాదరావు, బొత్స సత్యనారాయణ.. ఇప్పుడు వైసీపీలో కీలక మంత్రులుగా వున్న సంగతి తెలిసిందే.

పృధ్వీ విషయానికి వస్తే, ఆయన వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడానికి సంసిద్ధమవుతున్నారట. ఆర్థిక వనరులూ సమకూర్చుకుంటున్నారని తెలుస్తోంది. జనసేన తరఫున ఆయన పోటీ చేస్తారనీ, అది కూడా మంత్రి అంబటి రాంబాబుపైనే పోటీ చేస్తారనీ ఓ ప్రచారం జరుగుతోంది.

ఇదేదో ‘బ్రో’ సినిమా విడుదలయ్యాక నడుస్తున్న వివాదంతో మారిన పొలిటికల్ సీన్ కాదు.! గత కొన్ని నెలలుగా, ఈ విషయమై జనసేన అధినేత నుంచి గ్రీన్ సిగ్నల్ కోసం పృధ్వీ ప్రయత్నిస్తున్నట్లు చెబుతున్నారు.

జనసేనాని నుంచి పృధ్వీకి ఎలాంటి గ్రీన్ సిగ్నల్ ఇంతవరకు రాకపోయినా, ‘బ్రో’ వివాదం తర్వాత, జనసేన శ్రేణులు పృధ్వీకి ఆ అవకాశం వస్తే బావుంటుందనుకుంటున్నారు.