రెడ్ అలర్ట్… బాబుకు హెచ్చరికలు పంపుతున్న 5 స్థానాలు!

ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఈ ఎన్నికలు టీడీపీకి ఎంత ప్రతిష్టాత్మకం, మరెంత ప్రాముఖ్యం అనేది మిగిలిన వారికంటే ఎక్కువగా చంద్రబాబుకే తెలుసు! ఈ ఎన్నికల్లో గెలవని పక్షంలో నిలవడం కష్టమనే కామెంట్లూ వినిపిస్తున్నాయి. అయినప్పటికీ చంద్రబాబు ఇంకా తనదైన పాతచింతకాయ పచ్చడి రాజకీయాలే చేస్తున్నారని, అటువంటి వ్యూహాలే పన్నుతునారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఫలితంగా కొన్ని నియోజకవర్గాల్లో సరికొత్త తలనొప్పులు తెరపైకి వస్తున్నాయి.

ఈసారి ఏపీలో ఏ పార్టీ అధికారంలోకి రాబోతుందనేది తేల్చే విషయంలో ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలు కీలక భూమిక పోషించబోతున్నాయనేది విశ్లేషకుల మాటగా ఉంది! ఈ సమయంలో తూర్పుగోదావరిలో తమ్ముళ్ల మధ్య రచ్చ తారా స్థాయికి చేరుకుంటుందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. జనసేనతో సీట్ల సర్ధుబాటు, తమ అభ్యర్థుల ఎంపికపై స్పష్టత కరువవ్వడంతో తూర్పుగోదావరి జిల్లాలో తమ్ముళ్ల ఫైట్ వీధికెక్కుతుందనే మాటలు వినిపిస్తున్నాయి. వీరికి జనసేన నేతలు కూడా తోడయ్యారని తెలుస్తుంది.

గోపాలపురం:

గోపాలపురం నియోజకవర్గం విషయానికొస్తే… ఇక్కడ నుంచి టీడీపీ తరుపున 2014లో గెలిచి, 2019 ఎన్నికల్లో చాలా మందితోపాటు తాను కూడా ఓటమిపాలైన ముప్పిడి వెంకటేశ్వర రావు ఈసారి కూడా ఎమ్మెల్యేగా పోటీ చేయాలని భావిస్తున్నారు. ఆయన వర్గం కూడా ఈ మేరకు బలంగా ఫిక్సయ్యింది. ఇంతకాలం పార్టీని కాపాడిన వ్యక్తిగా ఆయనకు కార్యకర్తలు బలంగా నిలబడుతున్నారు.

అయితే ఈ వెంకటేశ్వరరావును నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ పదవి నుంచి తప్పించి.. ఆయన స్థానంలో మద్దిపాటి వెంకట్రాజును బాబు నియమించారు. ఈ విషయంలో తనకు ఎలాంటి సమాచారం లేకుండా చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకోవడంతో… ఇరు వర్గాల మధ్య విభేదాల పీక్స్ కి చేరాయి. అప్ప­టి నుంచీ ముప్పిడి వర్గం, ఎస్సీ సామాజికవర్గ నేతలు టీడీపీ అధినేతపై కారాలు, మిరియాలూ నూరుతున్నారని తెలుస్తుంది.

ఈ విషయంలో చంద్రబాబు కల్పించుకుని అసంతృప్తులను బుజ్జగించే పనికి పూనుకోలేదు. దీంతో… వీరిమధ్య గ్యాప్ మరింత పెరిగిపోతుందని, కార్యకర్తలు సైతం రెండుగా చీలిపోయారని తెలుస్తుంది. ఈ సమయంలో వీరిమధ్య విభేదాల కారణంగా… వచ్చే నష్టంపై జనసేన నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారట. టీడీపీతో స్నేహం తమ ఓటమికి వచ్చేలా ఉంద్ని వాపోతున్నారని అంటున్నారు.

కొవ్వూరు:

ఇదే సమయంలో కొవ్వూరు విషయానికొస్తే.. ఇక్కడ నుంచి పోటీ చేయాలని మాజీ మంత్రి కేఎస్‌ జవహర్‌ ఉవ్విళ్లూరుతున్నారు. మరోపక్క జిల్లా పార్టీ పగ్గాలు జవహార్ కు అప్పగించినా.. కొవ్వూరు వ్యవహారాలకు మాత్రం ఆయనను దూరం పెట్టి పెండ్యాల అచ్చిబాబుకు అప్పగించారని తెలుస్తుంది. దీంతో… జవహార్ కు ఈ దఫా టిక్కెట్ లేదా అనేచర్చ మొదలవ్వడంతో ఆయన వర్గీయులు అగిమీద గుగ్గిలం అవుతున్నారు.

మరోపక్క ఒకప్పటి టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే టీవీ రామారావు జనసేనలో చేరిన సంగతి తెలిసిందే. పవన్ కల్యాణ్ నుంచి తనకు టిక్కెట్ కన్ ఫాం అయ్యిందని ఆయన బల్లగుద్ది చెబుతున్నారని తెలుస్తుంది. దీంతో… కొవ్వురు విషయంలో స్పష్టత కొరవడంతో… టీడీపీ వర్సెస్ టీడీపీతోపాటు.. టీడీపీ వర్సెస్ జనసేన సమస్య ఇక్కడ నెలకొందని చెబుతున్నారు.

రాజానగరం:

ఇక రాజానగరం విషయానికొస్తే… పొత్తులో భాగంగా ఈ టిక్కెట్ జనసేనకు కేటాయిస్తారని మొదటి నుంచీ ప్రచారం జరుగుతుంది. ఈ విషయంలో జనసేన నేత బత్తుల బలరామకృష్ణ ధీమా వ్యక్తం చేస్తున్నారు. దీంతో… టీడీపీ టికెట్‌ ఆశస్తున్న బొడ్డు వెంకట రమణ చౌదరి వర్గం సీరియస్ గా ఉందని తెలుస్తుంది.

మరోపక్క 2009, 2014లో వరుసగా గెలిచి 2019 జగన్ వేవ్ లో ఓటమి పాలైన మాజీ ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేష్‌ వర్గం రెబల్స్ గా మారే అవకాశాలున్నాయని అంటున్నారు. దీంతో… రాజానగరంలో టీడీపీ, జనసేనల మధ్య త్రిముఖ పోరు సమస్య తెరపైకి వచ్చింది. వీరిలో టిక్కెట్ దక్కని ఒకరు ఇండిపెండెంట్ గా పోటీచేసినా ఆశ్చర్యం లేదని అంటున్నారు.

నిడదవోలు:

ఇదే సమయంలో నిడదవోలు విషయానికొస్తే… 2009, 2014ల్లో వరుసగా గెలిచిన మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషా­రావుకే ఈ దఫా టిక్కెట్ అని ఆయన వర్గం బలంగా భావిస్తుండగా… టీడీపీ నుంచి కుందుల సత్యనారా­య­­ణ వర్గం కూడా లైన్ లోకి వచ్చింది. ఈసారి టిక్కెట్ తమ నేతకే అంటూ పోస్టులు పెడుతుంది.. ప్రచారం కూడా షురూ చేసింద్ని తెలుస్తుంది!

మరోపక్క నిడదవోలు జనసేనకు కేటాయిస్తారని జనసైనికులు చెప్పుకుంటున్న నేపథ్యంలో… చేగొండి హరిరామజోగయ్య కుమారుడు సూర్యప్రకాష్‌ సైతం రేసులో ఉన్నారని అంటున్నారు. దీంతో… టీడీపీ, జనసేన కూటమిలో ఈ సీటు కూడా కాకరేపే ప్రమాధం ఉందని అంటున్నారు.

రాజమండ్రి రూరల్:

ఇక ఈస్టులో మరో ముఖ్యమైన, కీలకమైన స్థానం రాజమండ్రి రూరల్ కూడా ఇప్పుడు చర్చనీయాంశం అవుతుంది. ఇందులో భాగంగా… ఈదఫా రాజమండ్రి రూరల్ స్థానం తమకే అని జనసేన నేత కందుల దుర్గేష్ వర్గం చెబుతుండగా… బుచ్చయ్య చౌదరి వర్గం ఆ మాటలు వినడానికి కూడా ఇష్టపడటం లేదు! బుచ్చయ్య లాంటి సీనియర్లను దూరం పెడితే… పరిణామాలు తీవ్రంగా ఉంటాయని తమ్ముళ్లు హెచ్చరిస్తున్నారు.

అయితే ఇవి మచ్చుకు కొన్ని ఉదాహరణలు మాత్రమే అని చెప్పుకోవాలి. ఇలాంటి సమస్యలు రాష్ట్ర వ్యాప్తంగా చాలానే ఉన్నాయని తెలుస్తుంది. అయినప్పటికీ అభ్యర్థుల ఎంపిక విషయంలో చంద్రబాబు ఇంకా నాన్చుడు ధోరణిలో ఉంటున్నారు. ఇది ఇలానే కొనసాగితే అసంతృప్తులు, రెబల్స్ గా మారే ప్రమాధం లేకపోలేదని అంటున్నారు పరిశీలకులు.