రాష్ట్రంలోని ప్రైవేటు స్కూళ్ళ యాజమాన్యాలు జగన్మోహన్ రెడ్డికి పెద్ద షాకే ఇస్తున్నాయ్. పాఠశాలల్లో పిల్లలను చేర్పిస్తే అమ్మఒడి పథకంలో ప్రతీ తల్లి ఖాతాలో ఏడాదికి రూ 15 వేలు వేస్తానని జగన్ హామీ ఇచ్చిన విషయం అందరికీ తెలిసిందే. ఆ డబ్బులు కోసం ప్రైవేటు స్కూళ్ళ యాజమాన్యాలు పెద్ద ప్లానే వేశాయి.
ఎలాగూ విద్యా సంవత్సరం మొదలైంది కాబట్టి పిల్లలను తమ స్కూళ్ళల్లో చేర్పించుకునేందుకు ప్రైవేటు స్కూళ్ళ యాజమాన్యాలు పెద్ద ఎత్తున ప్రయత్నాలు ప్రారంభించాయి. స్కూళ్ళ తరపున ఉద్యోగులను పెట్టుకుని తమ స్కూళ్ళల్లో చేర్పిస్తే ప్రతీ తల్లికి రూ. 15 వేలు వస్తాయంటూ ఊదరగొడుతున్నాయి. ఈ పథకం వచ్చే జనవరి 26వ తేదీ నుండి ఆరంభమవుతోంది.
ఒకవైపు ప్రైవేటు యాజమాన్యాలు ఎంత మొత్తుకుంటున్నా ఎందుకైనా మంచిదని తల్లి దండ్రులు తమ పిల్లలను ప్రైవేటు స్కూళ్ళ నుండి ప్రభుత్వ పాఠశాలలకు మార్చేస్తున్నారు. దానికి ప్రైవేటు యాజమాన్యాలు అంగీకరించటం లేదు. ఫలితంగా వస్తాయనుకుంటున్న డబ్బుల కోసం యాజమాన్యాలకు-తల్లి, దండ్రులకు మధ్య గొడవలవుతున్నాయి.
ప్రభుత్వం నుండి పిల్లల పేరుతో రూ. 15 వేలు తెప్పించే బాధ్యత తమే అని, అందుకు అవసరమైన వ్యవహారాలన్నీ తాము చేయిస్తామంటూ యాజమాన్యాలు హామీలిస్తున్నాయి. నిజానికి జగన్ ఇచ్చిన హామీలోనే కాస్త కన్ఫ్యూజన్ ఉంది. పిల్లలను స్కూళ్ళల్లో చేర్పిస్తే డబ్బులివ్వటం వరకూ బాగానే ఉంది. అయితే అది ప్రభుత్వ స్కూళ్ళకే పరిమితమా ? లేకపోతే ప్రైవేటు స్కూళ్ళల్లో చేర్పించినా ఇస్తారా ? అన్న విషయంలోనే భిన్న వాదనలు వినిపిస్తున్నాయి.