విద్యావ్యవస్థ ఎంత బావుంటే, సమాజం అంత బావుంటుంది. ప్రభుత్వాలు ఎంతలా విద్య మీద ఖర్చు చేస్తున్నా, ప్రైవేటు విద్య ముందు.. ప్రభుత్వ విద్యా సంస్థలు విలవిల్లాడిపోతున్నమాట వాస్తవం. కానీ, సీన్ మారింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రైవేటు స్కూళ్ళకు ధీటుగా ప్రభుత్వ స్కూళ్ళు మారుతున్నాయి. ‘నాడు – నేడు’ అంటూ స్కూళ్ళను బాగు చేసే ప్రక్రియకు వైఎస్ జగన్ సర్కార్ శ్రీకారం చుట్టింది. దాదాపుగా అన్ని స్కూళ్ళూ సరికొత్త కళను సంతరించుకున్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఈ విద్యా సంవత్సరం స్కూళ్ళకు వెళ్ళే విద్యార్థులకు సరికొత్త అనుభూతితోపాటు, సరికొత్త సౌకర్యాలు ఆహ్వానం పలకనున్నాయి.
‘ముందు ముందు ప్రైవేటు స్కూళ్ళ అవసరం లేకుండా పోవచ్చు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో’ అనే చర్చ విద్యార్థుల తల్లిదండ్రుల్లో కనిపిస్తోంది. అందుకు తగ్గట్టే, ప్రైవేటు స్కూళ్ళలోంచి వచ్చి ప్రభుత్వ స్కూళ్ళలో చేరుతున్నవారి సంఖ్య పెరుగుతోందని అధికారులు చెబుతున్నారు. విద్య మీద ప్రభుత్వాలు చేస్తున్న ఖర్చు ఓ యెత్తు అయితే, తల్లిదండ్రులు చేస్తున్న ఖర్చు ఇంకో యెత్తు. ఆర్థికంగా పేద కుటుంబాల్నీ, మధ్యతరగతి కుటుంబాల్నే కాదు, ఎగువ మధ్య తరగతి కుటుంబాల్నీ ప్రైవేటు విద్యా సంస్థలు కబళించేస్తున్నాయన్నది నిర్వివాదాంశం. ఇలాంటి పరిస్థితుల్లో స్కూళ్ళలో నాడు నేడు తెచ్చిన మార్పు.. అమోఘం, అత్యద్భుతం. ఈ మార్పుకి ప్రజల నుంచి స్పందన మరింత మెరుగ్గా వస్తే.. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కల నిజమయినట్లే భావించాల్సి వుంటుంది. ప్రైవేటు స్కూళ్ళ దందాకు చెక్ పెట్టడమంటూ జరిగితే, విద్యా రంగంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వేసిన ఈ ముద్ర.. చరిత్రలో నిలిచిపోతుందన్నది నిర్వివాదాంశం.