పృధ్వీరాజ్ డిమాండ్.! ఆ ముగ్గుర్నీ పీకి పారెయ్యాల్సిందే.!

‘నేను వెనకనుండి వాటేసుకున్నానని నన్ను పార్టీ నుంచి, పదవి నుంచి సస్పెండ్ చేశారు. మరి, అవంతి శ్రీనివాస్, అంబటి రాంబాబు, గోరంట్ల మాధవ్‌లపై చర్యలు ఎందుకు తీసుకోవడంలేదు.?’ అంటూ సినీ నటుడు, మాజీ వైసీపీ నేత, ఎస్వీబీసీ ఛానల్ మాజీ ఛైర్మన్ ‘థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ’ పృధ్వీరాజ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

2019 ఎన్నికలకు ముందు వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో అత్యంత సన్నిహతంగా వుంటూ, వైఎస్ జగన్ వెంట పాదయాత్రలో తిరుగుతూ, విపక్షాలపై దుమ్మెత్తిపోశారు పృధ్వీ. ప్రముఖ సినీ నటుడు మోహన్‌బాబు, అలాగే మరికొందరు సినీ ప్రముఖులు అలీ, పోసాని కృష్ణమురళి తదితరులు కూడా వైసీపీ కోసం పని చేసినా, ఎవరికీ దక్కని ప్రత్యేక గౌరవం పృధ్వీరాజ్‌కి దక్కింది.

అయితే, ఎస్వీబీసీ ఛానల్ ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన పృధ్వీరాజ్, అక్కడే ఓ ఉద్యోగితో అసభ్యకర ప్రవర్తన చేసినట్లు ఓ ఆడియో టేపు బయటకు వచ్చింది. దాంతో, ఆయన్ని పదవి నుంచి తొలగించారు. ఆ తర్వాత ఆయన వైసీపీకి దూరమయ్యారు.

అంతకు ముందు అదే పృధ్వీరాజ్, వైసీపీ మాయలో వున్నప్పుడు, అమరావతి మహిళా రైతుల్ని ‘కూకట్‌పల్లి ఆంటీలు’ అంటూ వెటకారం చేసిన విషయం విదితమే. పార్టీ నుంచి బయటకు వచ్చాక, ఫాఫం పృధ్వీరాజ్‌కి ఆ బులుగు పైత్యం తగ్గినట్లుంది.

సరే, ఆ సంగతి పక్కన పెడితే, తనను పార్టీ నుంచి, పదవుల నుంచి తప్పించినట్లే అంబటిపైనా, అవంతిపైనా, గోరంట్లపైనా చర్యలు తీసుకోవాలని పృధ్వీరాజ్ డిమాండ్ చేస్తున్న దరిమిలా అంతటి సాహసోపేతమైన నిర్ణయం వైఎస్ జగన్ తీసుకుంటారా.? అన్నది ప్రస్తుతానికైతే సస్పెన్స్. సంచలన నిర్ణయం తీసుకుంటే మాత్రం, వైఎస్ జగన్ తన చిత్తశుద్ధిని నిరూపించుకున్నట్లవుతుంది.