టీడీపీ సీనియర్ నేత పరిస్థితి విషమం (వీడియో)

శాసనసభ మాజీ స్పీకర్, టీడీపీ సీనియర్ నేత ప్రతిభాభారతి గుండెపోటుతో ఆసుపత్రి పాలయ్యారు. ప్రస్తుతం ఆమె విశాఖలోని పినాకిల్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. ఆమె ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం విషమంగానే ఉందని డాక్టర్లు తెలుపుతున్నారు. ప్రతిభాభారతి తండ్రి, హై కోర్ట్ మాజీ న్యాయమూర్తి జస్టిస్ పున్నయ్య గురువారం అర్ధరాత్రి తీవ్ర అస్వస్థతకు గురవడంతో ఆసుపత్రికి తరలించారు.

తండ్రి ఆరోగ్యంపై తీవ్ర ఆందోళనకు గురైన ప్రతిభాభారతి హాస్పిటల్ సమీపంలోకి చేరుతుండగానే అస్వస్థకు గురై వాంతులు చేసుకున్నారు. హాస్పిటల్ కి చేరుకునేసరికి ఆమె ఆరోగ్యం మరింత విషమించి అక్కడే గుండెపోటుతో కుప్పకూలిపోయారు. వెంటనే డాక్టర్లు ఆమెను ఐసీయూ కి తరలించి వైద్య పరీక్షలు చేసారు. బీపీ, షుగర్ బాగా పెరిగినట్లు డాక్టర్లు నిర్ధారించారు.

రెండు రోజులు అబ్సర్వేషన్ లో ఉంచితే కానీ ఆమె ఆరోగ్య పరిస్థితి సహజ స్థితికి చేరుకుందో లేదో చెప్పగలమని డాక్టర్లు చెప్పినట్టు ఆమె కుమార్తె గ్రీష్మ తెలిపారు. ఇక ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు శుక్రవారం ఆసుపత్రి వర్గాలతో ప్రతిభ భారతి ఆరోగ్య పరిస్థితి గురించి డాక్టర్లను ఆరా తీశారు. ఆమెకు మెరుగైన చికిత్స అందించవలసిందిగా కోరారు. ప్రతిభ కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పిన సీఎం అవసరమైతే బెంగుళూరు తరలించమని సూచించినట్లు సమాచారం.

కావలి ప్రతిభా భారతి టీడీపీలో సీనియర్ నేతగా మంచి గుర్తింపు సంపాదించారు.. ఎన్టీఆర్ పార్టీ స్థాపించగానే, అన్నగారి బాటలో నడిచి శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నుండి ఎన్నికల్లో విజయం సాధించడంతోపాటు మంత్రి పదవి కూడా దక్కించుకున్నారు. 1983 నుండి 1999 వరకు ఐదుసార్లు టీడీపీ తరపు నుండి గెలుపొందారు. సాంఘిక సంక్షేమ శాఖ, ఉన్నత విద్యాశాఖామంత్రిగా పదేళ్లకు పైగా పని చేసారు.

1999 నుండి 2004 వరకు మొట్టమొదటి మహిళా స్పీకర్ గా పని చేసి రికార్డు నెలకొల్పారు. 2004 లో ఎచ్చెర్ల నుండి కాంగ్రెస్ తరపున బరిలోకి దిగిన కొండ్రు మురళి చేతిలో అపజయం పాలయ్యారు. అయితే 2009 లో నియోజక వర్గాల పునర్విభజన సమయంలో ఎస్సీ రిజ‌ర్వ్‌డ్‌ స్థానంగా ఉన్న ఎచ్చెర్ల జనరల్ సీటుగా మారింది. కొత్తగా ఏర్పడిన రాజాం నియోజకవర్గం ఎస్సీ రిజ‌ర్వ్‌డ్‌ కేటగిరిలో చేరింది.

దీంతో ప్రతిభా భారతి మకాం రాజాం కు మారింది. అయితే ఆమె స్వగ్రామం కావలి కూడా రాజాం నియోజక వర్గంలోని సంతకవిటి మండలంలోనే ఉండడంతో ఇక్కడ కూడా తనకి ఎదురులేదని భావించారు. కానీ 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి కొండ్రు మురళి(ఇటీవలే టీడీపీలో చేరారు) చేతిలో, 2014 లో వైసీపీ అభ్యర్థి కంబాల జోగుల చేతిలో అపజయం పాలయ్యారు.