గతకొంతకాలంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై విరుచుకుపడుతున్న వైసీపీ నేతల్లో… పేర్ని నాని, అంబటి రాంబాబు, గుడివాడ అమర్నాథ్ లు ముందు వరుసలో ఉంటుంటారు. వీరంతా కాపు సామాజికవర్గానికి చెందిన నేతలు కావడంతో వీరినే జగన్, పవన్ పై ప్రయోగిస్తున్నారని జనసేన నేతలు ఆరోపిస్తుంటారు. అయితే ఈసారి నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఈ లిస్ట్ లో చేరిపోయారు. పవన్ ని విమర్శించే విషయంలో తగ్గేదేలే అంటూ చెలరేగిపోయారు.
టీడీపీతో పొత్తు పై ఆల్ మోస్ట్ క్లారిటీ ఇవ్వడమే కాకుండా… బెస్ట్ పరిపాలన అందిస్తాను అనే కంటే ఎక్కువగా… జగన్ ని పవర్ లో నుంచి దింపడమే తన లక్ష్యమని, తన లక్ష్యానికి జనసైనికులు తోడు ఉండాలని చెబుతున్న సంగతి తెలిసిందే. దీంతో… చంద్రబాబుని సీఎం చేయడానికి పవన్ పరితపించిపోతున్నారని.. జనసైనికులను గంపగుత్తగా బాబుకు తాకట్టు పెట్టేస్తున్నాడని వైకాపా నేతలు విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ విషయంలో తాజాగా మైకందుకున్నారు నెల్లూరు జిల్లా కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి.
పవన్ కల్యాణ్ తన శీలాన్ని చంద్రబాబుకి అమ్మేశాడని ప్రసన్న కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రతిఫలంగా ఎన్ని వందల కోట్లు తీసుకున్నారో పవన్-చంద్రబాబు లకే తెలుసని.. కేవలం డబ్బుల కోసమే జనసేన పార్టీ పెట్టారని.. చంద్రబాబు పాదాల దగ్గర దాన్ని తాకట్టు పెట్టారని సెటైర్లు వేశారు. ఈ సందర్భంగా తనను ప్యాకేజీ స్టార్ అని అంటే చెప్పుతో కొడతా అంటూ పవన్ చేసిన వ్యాఖ్యలపై ప్రసన్న కుమార్… పవన్ కి ఒక ఛాలెంజ్ విసిరారు.
ప్యాకేజీ స్టార్ అని అన్నవారిని చెప్పుతో కొడతానంటూ పవన్ ప్రగల్భాలు పలుగుతున్నారని.. ఆ మాట తాను అంటున్నానని, తనని కొట్టడానికి కోవూరు వస్తాడా అని ఛాలెంజ్ విసిరారు ప్రసన్న. పవన్ కల్యాణ్ నిజంగానే ప్యాకేజీ స్టార్ అని పదే పదే నొక్కి వక్కానించారు. ఈ సందర్భంగా రంగాని తెరపైకి తెచ్చిన ఆయన… వంగవీటి రంగాని చంపించింది చంద్రబాబు అవునో కాదో చెప్పాలని పవన్ కల్యాణ్ అభిమానుల్ని ప్రసన్నకుమార్ రెడ్డి సూటిగా ప్రశ్నించారు. దీంతో… ప్రసన్న కుమార్ రెడ్డి వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి!
ఏది ఏమైనా… పవన్ కల్యాణ్ పొత్తుల వ్యవహారంపై వైసీపీ నుంచి తీవ్ర విమర్శలు ఎదురవుతున్నాయి. మేం సింగిల్ గానే పోటీ చేస్తామని చెబుతూనే.. మరోవైపు ప్రతిపక్షాల కలయిక అనైతికం అంటూ ఎద్దేవా చేస్తున్నారు వైసీపీ నేతలు. ఈ విషయంలో పవన్ ని మాటలతో బలంగా బాదేస్తున్నారు!