వైసీపీ సీనియర్ నేత, మంత్రి ధర్మాన ప్రసాదరావు ఇంకోసారి రాజధాని విషయమై సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘విశాఖపట్నం పూర్తి స్థాయి రాజధాని కాబోతోంది. పూర్తిస్థాయి రాజధానికి అర్హత కలిగిన ఒకే ఒక్క నగరం విశాఖ మాత్రమే. ఇప్పుటు కాకపోతే ఇంకెప్పుడు. విశాఖకు రాజధాని రావడం కోసం ఉత్తరాంధ్ర ఉద్యమించాల్సి వుంటుంది..’ అంటూ మంత్రి ధర్మాన వ్యాఖ్యానించారు.
మరి, అమరావతి అలాగే కర్నూలు మాటేమిటి.? అంటే, అవి నామమాత్రపు రాజధానులన్నది మంత్రి ధర్మాన ఉవాచ. అమరావతి ఎలాగూ వైసీపీ దృష్టిలో కమ్మరావతి మాత్రమే. దానికి ముందు ముందు రాజధాని హోదా కూడా వుండకపోవచ్చు. వైసీపీ, అమరావతిపై ఏ స్థాయిలో పగబట్టేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అమరావతిని స్మశానంగా, ఎడారిగా వైసీపీనే అభివర్ణిస్తోంది.
అమరావతి సంగతి పక్కన పెడితే.. అసలు కర్నూలు పరిస్థితేంటి.? కర్నూలుని న్యాయ రాజధాని అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెబుతున్నారు. కానీ, ఆ న్యాయ రాజధానిని కూడా ఉత్తుత్తి రాజధానిగా మంత్రి ధర్మాన అభివర్ణిస్తుండడం ఒకింత ఆశ్చర్యకరమైన విషయమే. వాస్తవానికి విశాఖకు అన్నీ వున్నాయ్.. రాజధాని అయ్యేందుకు అన్ని అర్హతలూ వున్న నగరం విశాఖపట్నం. కానీ, ఆ విశాఖను కాదని చంద్రబాబు ప్రభుత్వం అమరావతిని రాజధానిగా మార్చింది. ఆ అమరావతికి వైసీపీ కూడా అప్పట్లో ప్రతిపక్షం హోదాలో మద్దతిచ్చింది. రాష్ట్రానికి ఓ రాజధాని ఖరారయ్యాక.. ఇష్టమొచ్చినట్లు దాన్ని మార్చేస్తే నష్టపోయేది రాష్ట్రమే.! ఆ సోయ మాత్రం అధికార వైసీపీలో కనిపించడంలేదు.
