ఒక రెడ్డి, ఒక కమ్మ, మధ్యలో ఒక స్వామిజీ

అనంతపురం ఎంపి దివాకర్ రెడ్డి చాలా రోజులుగా రెండు అంశాలను ప్రముఖంగా చెబుతూ వస్తున్నారు. ఇందులో ఒకటి, అనంతపురం జిల్లా టిడిపి కమ్మ వాసన వేస్తున్నదని, రెండోది ఫ్రెండ్లీ పోలీసుల పేరుతో పోలీసుల చేతకాని వాజమ్మలయ్యారని.

  తాడిపత్రి నియోజకవర్గం ,కాంగ్రెస్ పార్టీని  వదలి టిడిపిలో చేరి  2014 లో ఆయన అనంతపురం ఎంపిగా గెలుపొందాడు.  అనంతపురం ఎమ్మెల్యే టిడిపి అభ్యర్థి  ప్రభాకర్ చౌదరి. మునిసిపల్ కార్పొరేషన్ మేయర్ స్వరూప కూడా తెలుగుదేశం అభ్యర్థియే. అయినా సరే ఈ ముగ్గురి మధ్య వైరం రగులుకుంది. మేయర్, ఎమ్మెల్యే కమ్మ వారు.  జెసి దివాకర్ రెడ్డి అనంతపురం లోకి తాడిపత్రి రాజకీయాలు తెస్తున్నాడని, దానిని పడనీయమని ఛెయిర్ పర్సన్, ఎమ్మెల్యే పట్టుబట్టారు.  తాడిపత్రిలాగా అనంతపురాన్ని డెవెలస్ చేయాలనుకుంటున్నానని దివాకర్ రెడ్డి వాదిస్తున్నారు. ఈ వ్యవహారంలో దివాకర్ రెడ్డి వెనకంజ వేయాల్సి వచ్చింది. ఆయన ప్రతిపాదించిన పాతవూరు (అదే వోల్డ్ టౌన్) రోడ్డు వెడల్పు పని ఆగిపోయింది. ఇందులో ఆయన కమ్మ రాజకీయాలు చూశారు. ఏకంగా అదే మాట చాలా సార్లు అనేశారు. ఈ విషయం మీద ఆయన దీక్ష కూడ చేశారు.  మొత్తానికి అనంతపురం కమ్మ-రెడ్డి కోట్లాట కేంద్రమయింది.

 

అనంతపురం జిల్లాలో కమ్మ రెడ్డి రాజకీయ గొడవ ఈనాటిది కాదు. దశాబ్దాలుగా సాగుతూ వచ్చింది. ఇది ఫ్యాక్షనిజం అనే పేరుతో సాగుతూ వచ్చింది. కులం అంతగా పైకి కనిపించలేదు. జిల్లాలో వున్నవాళ్లందరికి తెలుసు ఫ్యాక్షనిజం కింద పారుతున్నదంతా కమ్మ రెడ్డి రాజకీయాలే నని.

 రాజకీయంగా రాయలసీమ రెడ్ల ప్రాంతం. ఇక్కడ రాజకీయనాయకులంతా రెడ్లే. కమ్యూనిస్టుల నుంచి అన్నిపార్టీలలో ఏదో ఒక స్థాయిలో రెడ్లదే పెత్తనం. ఇతర కులాలనుంచి రాయలసీమలో లీడర్లు తయారు కాలేదు. తయారయినవాళ్లంతా చీర్ లీడర్లే.  రెడ్ల పెత్త నాన్ని తట్టుకుని నిల్వగలిగిన ఏకైక రెడ్డియేతర కుటుంబం కర్నూలు జిల్లాకు చెందిన కెయి మాదన్న (కెఇ కృష్ణమూర్తి) కుటుంబమే.ఇక కమ్మల నుంచి వచ్చింది ఒక్క పరిటాల కుటుంబమే.పరిటాల రవి హత్య తర్వాత ఆ స్థాయినాయకుడు తయారు కాలేదు. అయితే, ప్రభాకర్ చౌదరి ఒక చిన్న ప్రయత్నం చేస్తున్నట్లు కనిపిస్తుంది.

అనంతపురం ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి

2004 లో  రాజశేఖర్ రెడ్ది రాకతో మళ్లీ రెడ్ల డామినేషన్ పెరిగింది. ఇది టిడిపిలో ఒక మార్పు తీసుకువచ్చింది. రాయలసీమలో కూడా అవకాశమున్నచోటల్లా రెడ్ల పెత్తనానికి చెక్ పెట్టి కమ్మలను ఎంకరేజ్ చేయాలని నిర్ణయించారు. 2014 తర్వాత ఈ కార్యక్రమం జోరుగా మొదలయింది. పైకి బిసిల జిల్లా అని ప్రచారం చేస్తూఅనంతపురం జిల్లాలో  టిడిపి ప్రభుత్వం రెడ్ల కు చెక్ పెట్టడం మొదలు పెట్టింది. అంటే  జిల్లాలో ఉన్న పెద్ద రెడ్డి జెసికి చెక్ పెట్టడమే. దీని పర్యవసానమే అనంతపురం గొడవలు.

టిడిపిలో చేరినా ఈ అనంతపురం పెద్దరెడ్డిని ఆ పార్టీలో ఎవరూ సీరియస్ గా తీసుకోవడం లేదు. దానికి తోడు ఆయన తన ప్రాబల్యాన్ని తాడిపత్రి నుంచి అనంతపురానికి విస్తరింపచేయాలనుకుంటున్నారు. దానిని అడ్డుకోవాలనుకుంటున్నారు కమ్మవారు.  జెసి దివాకర్ రెడ్డిగారి తాడిపత్రి రిపబ్లిక్ లో కూడా చిన్న చిన్న కమ్మ ప్రాంతాలున్నాయి. అక్కడ కమ్మ జండా పాతాలనుకుంటున్నారు. అక్కడ కమ్మవారిని సమీకరించి మెల్లిగా తాడిపత్రి  ని లాగేసుకోవాలన్నది కమ్మవారి దీర్ఘాలోచన. దీనికి పోలీసులు కూడా సహకరిస్తున్నారు. కమ్మ ప్రాబల్య విస్తరణకు పోలీసులు సహకరిస్తున్నారని అనలేక జెసి దివాకర్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం ఫ్రెండ్లీ పోలీస్  పేరుతో పోలీసులను ఎందుకు పనికిరాకుండా చేసిందని , రౌడీలను గుండాలను పక్కన కూచోబెట్టుకుని మాట్లాడుతున్నారని వాపోతున్నారు. అసలు ఉద్దేశం పోలీసులు కమ్మ వారికి సహకరిస్తున్నారని ఆరోపించడమే. ఆశ్రమం మీద చర్య తీసుకోవాలని జెసి నిరసన  తెలిపారు.

తాడిపత్రిని కబ్జాచేసేందుకు కమ్మవారు ప్రయత్నిస్తున్నారు. అనుమానమే లేదు.  ఈ గొడవే ప్రబోధానంద స్వామి ఆశ్రమం గొడవగా పైకొచ్చింది. కారణం, తాడిప్రతి ఏరియాలో ఒక కమ్మ కుటుంబానికి చెందిన వాడు ప్రబోధానందస్వామి. రాయలసీమలో బాబాలకు, యోగులుకు,స్వామీజీలకు కొరత లేదు.  ఇపుడు కులానికొక స్వామీజీ తయారువుతున్నారు. సక్సెస్ అయితే, ఆధ్యాత్మికాన్ని మించిన వ్యాపారం లేదు. ఈ బిజినెస్ లో ఫెయిలనేది ఉండదు. కనీసం ఒక ఆశ్రమం నడిపేందుకు ఎలాంటి ఆర్థిక ఇబ్బంది ఉండదు. ఎందుకంటే ప్రతి స్వామీజీకి ఒక కులం ఉంటుంది.కులస్థులు ఉప్పు పప్పు బియ్యం తప్పక అందిస్తారు. అందువల్ల  అక్కడక్కడ ఉన్న పాతకాలపు గుళ్లను, పండగలను పెద్ద కులాలు అప్రోప్రియేట్ చేసుకుంటున్నాయి. కడప జిల్లాలో జమ్మలమడుగు దగ్గిర ఉన్న గురప్ప స్వామిని రెడ్లు సొంతం చేసుకుని బాగా అభివృద్ధి చేసుకున్నారు. ఇపుడు తాడిప్రతి సమీపంలోని ప్రబోధానందాశ్రమాన్ని, స్వామీజీని కమ్మవారు సొంతంచేసుకుని మెల్లిగా స్వామీజి సహకారంతో కమ్మ జండా ఎగరేయాలనుకుంటున్నారని అక్కడ ఎవరినడిగినా చెబుతారు. (తెలంగాణలో వెలమలు చిన్నజీయర్ స్వామీజీని కులగురువును చేసుకున్నారు. హైదరాబాద్ సమీపంలోని జహంగీకర్ పీర్ దర్గా గౌడ్ల ఆదివారం విడిది అయింది.)

కమ్మటి ప్రసంగాల ప్రబోధానంద స్వామీజీ

కమ్మవారు విస్తరిస్తూ ఉండటం, రాష్ట్ర ప్రభుత్వం, పోలీసులు అండ ఉండటం, అక్కడజెసి కుటుంబ పెత్తనానికి సవాల్ ఎదురుకావడంతో ఆశ్రమం వివాదాస్పదమయింది. ఇరు వర్గాలు రాళ్లతో కొట్టుకున్నాయి. ఆశ్రమంలో ఉన్నవాళ్లు బయట వాళ్ల మీద రాళ్లేశారని, పోలీసులపైకే ఆశ్రమవాసులు రాళ్లు రువ్వినా పోలీసులు ఏమీ  చేయలేని పరిస్థితి ఎందుకొచ్చిందన్నది జెసి దివాకర్ రెడ్డి వేస్తున్న ప్రశ్న. రామా కృష్ణా అనుకుంటూ ఆశ్రమంలో భజనలు చేసుకుంటూ ఉండకుండా  ఈ గొడవలేమిటి?

 

జెసి దివాకర్ రెడ్డి , అనంతపురం ఎంపి

 తాడిపత్రిలోకి ప్రవేశించి జెసి రిపబ్లిక్ ని జయించాలనుకుంటున్న ఎమ్మెల్యే  ప్రభాకర్ చౌదరి దీని వెనక ఉన్నారని తాడిపత్రిలోఅందరికి తెలుసు. ఆశ్రమాన్ని లేపేయించాలని ఒక వైపు  జెసి కుటుంబం యోచిస్తున్నది. ఆ మధ్య ఆశ్రమానికి  పక్క నున్న పెన్నా నది  నుంచి ఇసుకను తరలిస్తున్నారని, ఇది నేరమని ( ప్రతి పొలిటిషియన్ ఇండియాల్ ఇసుకదొంగే) తాడిపత్రి ఎమ్మెల్యే  జేసీ ప్రభాకర్‌ రెడ్డి (జెపి దివాకర్ రెడ్డి సోదరుడు) అడ్డుపడ్డారు. ఇసుక లారీ డ్రైవర్‌ను తిట్టారో కొట్టారో తెలియదు గాని అతగాడు  పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు జెసి మీద కేసు పెట్టే సాహసం చేయలేదు. దీనితో  పోలీసులు కేసు నమోదు చేయలేదని ప్రబోధానంద ఆశ్రమవాసులు డ్రైవర్ తరఫున  మానవహక్కుల కమిషన్‌ను ఆశ్రయించారు. కమిషన్ జోక్యంతో పెద్దపప్పూరు పోలీసులు జేసీ ప్రభాకర్‌ రెడ్డిపై కేసు నమోదు చేశారు. ఆశ్రమానికి ఇంత పట్టింపు రావడం వెనక కమ్మ వర్గం ఉందని చెబుతున్నారు.  ఆశ్రమం  కమ్మ,చుట్టు బయట ఉన్నవారు రెడ్లు, వారి అనుచరులు. దీని వల్ల అక్కడ పచ్చిగడ్డి కూడా భగ్గున మండటం మొదలయింది.

ఇటీవల కమ్మలు  తాడిపత్రి  సమీపంలోని రావివెంకటాంపల్లి (రెడ్ల మధ్య ఉన్న కమ్మ ద్వీపం) వద్ద కమ్మసంఘం వారు కల్యాణ మండపం నిర్మించారు.  ఆశ్రమం నిధులతోనే దీనిని కట్టారని చెబుతారు. స్వామీజీ బాగా డబ్బున్నవాడే. ఆయన సహకారంతోనే కట్టి ఉంటారు. కల్యాణ మండపం శంకుస్థాపనకు పెద్ద పెద్ద కమ్మలంతా వచ్చారు.  మాజీ డీజీపీ రాముడు (అనంతపురం సమీపంలోని బత్తలపల్లి దగ్గిర  నార్జంపల్లి ఆయన వూరు), ఎమ్మెల్యే ప్రభాకర చౌదరి కూడా హాజరయ్యారు.  ఇది కమ్మకుల సంక్షేమ కార్యక్రమం అయినా,  ఆ ఏరియాలో అధిపత్యం ఉన్న జెసి కుటుంబానికి జీర్ణించుకోలేని వ్యవహారమయింది. ఎందుకంటే, తాను అనంతపురంలో తిష్టవేయకుండా అడ్డుకున్న ప్రభాకర్ చౌదరికి తన ఇలాకాలో కాలుపెట్టేందుకు ఒక కమ్మ ఆశ్రమం  అండగా  నిలబడిందన్నది ఆయన ఆక్రోశం.

ఆశ్రమం కమ్మవారి రాజకీయాశ్రయం కావడం, ఆశ్రమవాసులు ప్రజలమీదకు రాళ్లు రువ్వినా పోలీసులు పట్టించుకొనపోవడం   ఏదో రాజకీయ ముప్పు సూచిస్తూ ఉందని జెసి దివాకర్ రెడ్డి శంకిస్తున్నారు.ఇలాంటపుడు, తాను పార్టీలో ఉన్నా సరే , టిడిపి మళ్లీ అధికారంలోకి వస్తే, పోలీసుల అండతో కమ్మ వారు తాడిపత్రిలో సెటిలయిపోతారని భయం ఆయనలోఉన్నట్లుంది. ఆయన పోలీసులను తిడుతున్నా, నిజానికి తిడుతున్నది కమ్మవారినే. పోలీసులు చేతకాని దద్దమ్మలయ్యాని అంటున్నా, నిజానికి అంటున్నది చంద్రబాబునాయుడినే. అయినా, ఆయన కమ్మవాళ్ల టిడిపిలో ఉండలేడు, రెడ్ల వైసిపిలోకి రాలేడు… ఎలా?