వైఎస్ షర్మిల మీద కూడా ఏపీలో పోస్టర్లు వేస్తారా.?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి స్వయానా చెల్లెలు ఆమె. కానీ, రాజకీయం వేరు, బంధుత్వం వేరు. బాబాయ్ వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విషయంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వ్యవహార శైలి ఒకలా వుంది, వైఎస్ షర్మిల వ్యవహార శైలి ఇంకోలా వుంది.

కడప ఎంపీ అవినాష్ రెడ్డి మీద వైఎస్ వివేకా హత్య కేసులో తీవ్రమైన ఆరోపణలు వస్తున్నాయి. వాటి నుంచి డైవర్ట్ చేయడానికి, వైఎస్ వివేకా కుమార్తె మీద దారుణమైన ఆరోపణలు చేస్తున్నారు వైసీపీ నేతలు. అధినేత వైఎస్ జగన్ అనుమతి లేకుండా, సాక్షి మీడియాలో అయినా, వైసీపీ నేతల మాటల్లో అయినా సునీతా రెడ్డిపై విమర్శలు వస్తాయా.?

ఈ విషయమై వైఎస్ షర్మిల ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. చిన్నాన్న ఇమేజ్ చెడగొట్టడానికి కుట్ర జరుగుతోందని ఆరోపించారామె. వైఎస్ వివేకా ఆస్తుల్ని ఎప్పుడో సునీత పేరు మీద రాసేశారన్నది వైఎస్ షర్మిల ఉవాచ.

అయితే, 2017 ఎన్నికల సమయంలో (శాసన మండలి ఎన్నికల సమయంలో) వైఎస్ వివేకా సుమారుగా 40 కోట్ల విలువైన ఆస్తుల్ని కలిగి వున్నట్లుగా అఫిడవిట్ దాఖలు చేసినట్లు వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలు సంబంధిత వివరాల్ని వెల్లడిస్తున్నారు.

అంటే, మొన్నటికి మొన్న టీడీపీలో సునీతా రెడ్డి చేరుతున్నట్లు పోస్టర్లు వేయించినట్లే, టీడీపీలో వైఎస్ షర్మిల చేరతారనే పోస్టర్లను వైసీపీ సిద్ధం చేసుకోవాల్సిందేనేమో.!