తిత్లీ చుట్టూ చవకబారు రాజకీయం ? ఎన్నికలే కారణమా ?

తుపాను, వరదల్లాంటి ప్రకృతి వైపరీత్యాలు తలెత్తినపుడు చుట్టుపక్కల ప్రజలంతా ఏకమై బాధితులకు ఎవరికి తోచిన సాయం వారు చేస్తుంటారు.  ఎక్కడన్నా జరిగేదిదే. మొన్నటికి మొన్న కేరళలో వరదల సందర్భంలో జరిగిన సహాయ, పునరావాస కార్యక్రమాలు జరిగిన విధానం అందరూ చూసిందే. కానీ ప్రస్తుతం తిత్లీ తుపాను తర్వాత ఏం జరుగుతోంది ? తుపాను అడ్డం పెట్టుకుని అధికార తెలుగుదేశంపార్టీ, ప్రధాన ప్రతిపక్షం వైసిపిలు రాజకీయాలు చేస్తున్నాయి. ఆ రెండు పార్టీలకు తోడుగా మిగిలిన ప్రతిపక్షాలు తలా కాస్త ఆజ్యం పోస్తున్నాయి. కారణమేదైనా కాంగ్రెస్ నేతలు మాత్రం నోరెత్తటం లేదు లేండి.

తుపాను వచ్చి ఓ ప్రాంతం తుడిచిపెట్టుకుపోయినపుడు సహాయ, పునరావాస కార్యక్రమాలు అంత తొందరగా జరగదన్న మాట వాస్తవం. బాధితులకు సాయం అందటంలో జాప్యం జరగటం చాలా సహజం. ప్రభుత్వం ఎంత యుద్ధ ప్రాతిపదికన కార్యక్రమాలు చేపట్టినా బాధితులు అంత తొందరగా కోలుకోలేరు. తిత్లీ దెబ్బకు నష్టపోయిన శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలో జరుగుతున్నది కూడా అదే.

ఇక్కడే సమస్య మొదలైంది.  బాధితులకు పూర్తి సాయం అందకుండానే, పునరావాస కార్యక్రమాలు పూర్తి కాకుండానే ప్రభుత్వం పాజిటివ్ ప్రచారం  మొదలుపెట్టేసింది. అంతా చేసేశాం, అంతా బ్రహ్మాండమంటూ హోర్డింగులు పెట్టేసుకుంది.

నిజానికి తమకు సాయం అందలేదంటూ ఒకవైపు బాధితులు నెత్తీ నోరు మొత్తుకుంటున్నారు. మరోవైపు ప్రభుత్వమేమో ఆల్ ఈజ్ వెల్ అనే ప్రచారం చేసుకుంటోంది. మరి, ప్రతిపక్షం ఊరుకుంటుందా ? త్వరలో షెడ్యూల్ ఎన్నికలు రాబోతున్నాయి కదా ? అందుకనే ప్రభుత్వంపై మండిపడుతోంది.

తెలుగుదేశంపార్టీకి కొమ్ముకాసే మీడియాలో అంతా బ్రాహ్మండమని, వైసిపి మీడియాలో ఏమో బాధితుల ఆక్రందనలు, గగ్గోలు దృశ్యాలతో మోతెక్కిపోతోంది. తిత్లీని అడ్డం పెట్టుకుని జరుగుతున్న రాజకీయం చూస్తుంటే రాజకీయపార్టీలంటేనే  చీదర పుడుతోంది.

బాధితులను ఆదుకోవటంలో కూడా ఈ రాజకీయాలేంటో ఎవరికీ అర్ధం కావటం లేదు. నష్టపరిహారం విషయంలో కేంద్రం స్పందించటం లేదంటూ చంద్రబాబునాయుడు ఒకటికి రెండు లేఖలు రాసి ప్రధానిని బూచిగా చూపుతున్నారు. నిజానికి కరువు, తుపాను, వరదలు లాంటి విపత్తులు వచ్చినపుడు కేంద్రం నుండి బృందాలు అంత తొందరగా రావు. పరిస్దితులు సద్దుమణిగిన తర్వాతే వస్తాయి.

ఈ విషయంలో ఎప్పటి నుండో కేంద్రంపై విమర్శలు వినిపిస్తునే ఉన్నాయి. ఆ విషయం చంద్రబాబుకు తెలీంది కాదు. అయినా ప్రధానికి లేఖలు రాస్తున్నారంటే ఇక్కడా రాజకీయమే. అందుకే బిజెపి నేతలు మండిపోతున్నారు. సరే జనసేనాని పవన్ కల్యాణ్ కూడా చంద్రబాబుపై విరుచుకుపడుతున్నారు లేండి. మొత్తం తుపానును అడ్డంపెట్టుకుని పార్టీలు చేస్తున్న రాజకీయం రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే అన్నది మాత్ వాస్తవం.