గన్నవరం రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుటున్నాయి. టీడీపీ తరపున గెలిచిన వల్లభనేని వంశీ ఇప్పుడు టీడీపీకి రెబల్ గా మారి వైసీపీకి అనుకూలంగా ఉన్నారు. వైసీపీకి వంశీ అనుకూలంగా మారడం అక్కడి మొదటి నుండి వైసీపీలో ఉన్న నేతలకు నచ్చడం లేదు. అలాగే కొన్ని రోజుల క్రితం గన్నవరం వైసీపీ ఇంచార్జ్ ను నేనే, ఎమ్మెల్యేను నేనే అని వంశీ చేసిన వ్యాఖ్యలతో అక్కడి వైసీపీ నాయకులు ఊగిపోతున్నారు. గన్నవరంలో ఇప్పటికే రెండు వైసీపీ వర్గాలు ఉన్నాయి. ఒకటి సీనియర్ నేత దుట్టా రామచంద్రరావు, అలాగే రెండోది మొన్న ఎన్నికల్లో పోటీ చేసిన యార్లగడ్డ వెంకట్రావ్. అయితే వీరిని కాదని వంశీ చేస్తున్న హడావిడితో అనూహ్య పరిణామాలు గత కొన్ని రోజులుగా జరుగుతున్నాయి.
అయితే నిన్న సీనియర్ నేత దుట్టా ఓపెన్ అవ్వటంతో, ఈ విషయం రచ్చకు ఎక్కింది.తాము పార్టీలో ఎప్పటి నుండో ఉంటున్నామని, వైసీపీ పార్టీ జెండాను తామే మొదటి నుండి మోస్తున్నామని ఇక్కడ వైసీపీ తరపున వేరే నాయకులు పెత్తనం చెలయిస్తే చూస్తూ ఊరుకోమని వ్యాఖ్యానించారు. వంశీలా తాను జెండాలు మార్చలేదని, పార్టీ కోసం నిబద్ధతతో పని చేస్తున్నానని వెల్లడించారు. మళ్ళీ తాను ఎన్నికల్లో పోటీ చేస్తానని ప్రకటిస్తే 15రోజుల్లో ఒక శుభవార్త వింటారని దుట్టా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనం సృష్టిస్తున్నాయి. ఆ మంచి వార్త ఏంటని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి.
మొదట్లో వంశీ పార్టీలోకి రావడాన్ని వ్యతిరేకించిన యార్లగడ్డ ఇప్పుడు దుట్టా కలిసి పని చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. టీడీపీ నుండి వైసీపీలోకి వెళ్ళడానికి ప్రయత్నిస్తున్న వంశీకి అన్ని రకాలుగా చిక్కులు ఎదురవుతున్నాయి. ఉప ఎన్నికలకు వెళ్తే టీడీపీ నుండి మాత్రమే కాకుండా వైసీపీ నేతల నుండి కూడా వంశీ ఇబ్బందులు ఎదుర్కోనున్నారు. దుట్టా చేసిన వ్యాఖ్యలు గన్నవరంలో సంచలనం సృష్టిస్తున్నాయి.