గోరంట్ల మాధవ్ మీద రాజకీయ కుట్ర.! నిజమేనా.?

ప్రత్యేక హోదా గురించిన చర్చ లేదు. రైల్వే జోన్ వ్యవహారానికి సంబంధించిన మాటల్లేవ్. రాజధాని అమరావతి, పోలవరం ప్రాజెక్టు.. ఇవేవీ ముఖ్యమైన అంశాలు కానే కావు. కేవలం హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ న్యూడ్ లీక్ వ్యవహారమే హాట్ టాపిక్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయం ఇలా తగలడింది.

గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో కాల్ లీక్ వ్యవహారానికి సంబంధించి రాష్ట్ర హోంమంత్రి తానేటి వనిత స్పందించారు. ‘దీని వెనుక రాజకీయ కుట్ర వుందన్న అనుమానాలున్నాయి..’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారామె. ఓ హోంమంత్రి, ఇలా అనుమానాలు వ్యక్తం చేయడమేంటి.? అదీ, ఘటన వెలుగు చూసిన ఐదు రోజుల తర్వాత.

ఫోరెన్సిక్ పరిశీలనకు వీడియోను పంపారట.. ఆ నివేదిక రావాల్సి వుందట. ఇంత పెద్ద విషయమ్మీద విచారణ, ఇంత నెమ్మదిగానా.? ఫోరెన్సిక్ విశ్లేషణకు అంత సమయం పడుతుందా.? ఇలా బోల్డన్ని ప్రశ్నలు. ప్రభుత్వం మీద అంత పెద్ద మచ్చ పడ్డాక, ఆగమేఘాల మీద విషయం తేటతెల్లమవ్వాలి. అత్యంత సున్నితమైన అంశం కాబట్టి, నిజానిజాలు నిగ్గు తేలేందుకు సమయం పడుతుందా.? అంటే, ఆ ప్రస్తావనే అత్యం త చోద్యమైన వ్యవహారం.

లోక్ సభ స్పీకర్‌కి ఈ వివాదంపై టీడీపీ ఎంపీలు ఫిర్యాదు చేశారట. లోక్ సభ స్పీకర్ ఈ ఘటనపై ఎలాంటి చర్యలు చేపట్టగలుగుతారు.? అన్న కోణంలో వైసీపీ ఎంపీలు ప్రశ్నిస్తున్నారు. అది మార్ఫింగ్ వీడియో.. అనే విషయాన్ని వైసీపీ క్రమంగా జనం మీద బలంగా రుద్దే ప్రయత్నమైతే చేస్తోన్న విషయం సుస్పష్టమవుతోంది.

అయినా, వైసీపీకి సంబంధించిన వీడియో క్లిప్పింగులే ఎలా లీక్ అవుతున్నాయి.? అన్నది కాస్త లోతుగా ఆలోచించాల్సిన విషయం. అంబటి రాంబాబు, అవంతి శ్రీనివాస్ వ్యవహారమే కాదు, ఆ మధ్య మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి అనుచరుడిపై దాడికి సంబంధించిన వీడియో క్లిప్ కూడా లీక్ అయ్యింది.

అంతేనా.? ఎంపీ రఘురామకృష్ణరాజు తనను సీఐడీ అధికారులు చావగొట్టి, దాన్ని లైవ్‌లో పార్టీ పెద్దలకు చూపించినట్లు ఆరోపించారు. సో, విషయం చాలా పెద్దదేనన్నమాట.