Tirumala Temple: తిరుమలలో భక్తుడి ప్రాణం కాపాడిన పోలీస్

తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చిన ఓ భక్తుడు గుండెపోటుకు గురికాగా, అక్కడే విధుల్లో ఉన్న ఓ పోలీస్ కానిస్టేబుల్ సమయస్ఫూర్తితో వ్యవహరించి ఆయన ప్రాణాలను కాపాడారు. ఈ ఘటన ఆగస్టు 15, శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళితే… తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా, కంది మండలం, మామిడిపల్లి గ్రామానికి చెందిన మేడం శ్రీనివాసులు (61) తన కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారి దర్శనం కోసం తిరుమలకు వచ్చారు. దర్శనం అనంతరం, రాత్రి 9:30 గంటలకు లడ్డూ ప్రసాదాలు తీసుకుని పశ్చిమ మాడ వీధిలో నడుస్తుండగా, శ్రీనివాసులు అకస్మాత్తుగా గుండెపోటుతో కుప్పకూలిపోయారు.

సమీపంలోనే విధుల్లో ఉన్న తిరుమల వన్‌టౌన్ పోలీస్ కానిస్టేబుల్ గుర్రప్ప వెంటనే స్పందించి, శ్రీనివాసులు వద్దకు చేరుకుని సీపీఆర్ (కార్డియోపల్మనరీ రిససిటేషన్) చేశారు. సుమారు 90 సార్లు సీపీఆర్ చేయడంతో శ్రీనివాసులు కాస్త కోలుకున్నారు. అనంతరం అంబులెన్స్‌లో తిరుమలలోని అశ్విని ఆసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స అందించారు. మెరుగైన వైద్యం కోసం అక్కడి నుంచి తిరుపతిలోని స్విమ్స్ ఆసుపత్రికి తరలించారు.

స్విమ్స్‌లో చికిత్స పొందిన శ్రీనివాసులు పూర్తిగా కోలుకోవడంతో శనివారం ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. సకాలంలో స్పందించి తన తండ్రి ప్రాణాలను కాపాడిన కానిస్టేబుల్ గుర్రప్పకు శ్రీనివాసులు కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. దేవుడే కానిస్టేబుల్ రూపంలో వచ్చి తమ తండ్రిని కాపాడారని వారు ఆనందం వ్యక్తం చేశారు. ఈ ఘటనలో కానిస్టేబుల్ గుర్రప్పను అధికారులు అభినందించారు.

తిరుమలలో ఘనంగా గోకులాష్టమి, ఉట్లోత్సవం మరోవైపు, తిరుమలలో శనివారం గోకులాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా శ్రీవారి ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. గోగర్భం డ్యామ్ సమీపంలోని ఉద్యానవనంలో కాళీయమర్ధన శ్రీకృష్ణుడికి పంచాభిషేకాలు నిర్వహించి, ఉట్లోత్సం జరిపారు. శనివారం రాత్రి శ్రీవారి ఆలయంలోని బంగారు వాకిలి వద్ద ఏకాంతంగా తిరుమంజనం, ద్వాదశ ఆరాధన, గోకులాష్టమి ఆస్థానం నిర్వహించారు.

ఆదివారం సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఉట్లోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. ఈ ఉత్సవం కారణంగా ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలను టీటీడీ రద్దు చేసింది.

జెస్సికా పై డాల్ఫిన్ ఎటాక్ || Cine Critic Dasari Vignan EXPOSED Jessica Radcliffe Orca Attack || TR