రాష్ట్రంలో విచిత్రమైన పరిస్ధితులు కనిపిస్తోంది. ఏ పార్టీలో చేరాలన్నది జనాలిష్టం. జనాలు ఒకపార్టీలో నుండి మరోక పార్టీలోకి చేరటం మామూలే. తాజాగా టిడిపిలో నుండి వైసిపిలోకి చేరాలని అనుకుంటున్న జనాలను పోలీసులు అడ్డుకోవటమే విచిత్రంగా ఉంది. ఇంతకీ విషయం ఏమిటంటే, కడప జిల్లాలోని జమ్మలమడుగు నియోజకవర్గం నుండి ఫిరాయింపు మంత్రి ఆదినారాయణ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న విషయం తెలిసిందే. ఫిరాయింపు మంత్రికి పట్టున్న గ్రామాల్లోని కొన్ని కుటుంబాలు వైసిపిలో చేరాలని నిర్ణయించుకున్నాయి. ఆ మేరకు వైసిపి నేతలు మాజీ ఎంపి అవినాష్ రెడ్డి తదితరులకు కబురు చేశాయి. దాంతో బుధవారం గొరిగనూరు గ్రామంలో వైసిపి ఓ కార్యక్రమం ఏర్పాటు చేసింది.
అయితే, విచిత్రంగా బుధవారం తెల్లవారే వందలాది పోలీసులు ఒక్కసారిగా దిగిపోయారు. గొరిగనూరు తదితర గ్రామాల్లో భారీ ఎత్తున మోహరించారు. స్ధానికులకు తమ గ్రామాల్లో ఏం జరుగుతోందో అర్ధం కాలేదు. తమ వీధుల్లో ఎక్కడపడితే అక్కడే స్పెషల్ పోలీసులు తిరుగుతుండటంతో గ్రామస్తులు భయపడిపోయారు. గొడవలు జరక్కుండా జమ్మలమడుగులో ముందుజాగ్రత్తగా పోలీసులు 144వ సెక్షన్ కూడా విధించారు. కాసేపటికి గొరిగనూరు గ్రామస్తులు వైసిపిలోకి చేరబోతున్న విషయం అందరికీ తెలిసిందే. ఆ సందర్భంగానే పోలీసులు భారీ ఎత్తున మోహరించినట్లు గ్రామస్తులు తెలుసుకున్నారు.
పోలీసుల ఓవర్ యాక్షన్ వల్ల గొరిగనూరు లో కార్యక్రమం ఆగిపోయింది. ఎందుకంటే, అవినాష్ రెడ్డిని పోలీసులు పులివెందులలోనే హౌస్ అరెస్టు చేసేశారు. ముద్దునూరులో వైసిపి ఇన్చార్జిని, కడప మేయర్ ను కడపలో, జమ్మలమడుగులో మాజీ ఎంఎల్సీని ఇలా..ఎక్కడికక్కడ పోలీసులు వైసిపి నేతలను హైస్ అరెస్టు చేయటం విడ్డూరంగా ఉంది. ఉదయం నుండి సాయంత్రం వరకూ పోలీసుల హడావుడే ఎక్కువగా కనబడుతుండటంతో గొరిగనూరు గ్రామస్తులు తమ చేరికను విరమించుకున్నారు. వైసిపిలో చేరాలనుకున్న గ్రామస్తులను పోలీసుల ద్వారా భయపెట్టి అడ్డుకుంటున్నట్లు వైసిపి నేతలు తర్వాత మండిపడ్డారనుకోండి అది వేరే సంగతి. ఇక్కడ విషయం ఏమిటంటే, వైసిపిలో చేరికలను టిడిపి వందలాది పోలీసులను అడ్డుపెట్టుకుని భయపెట్టి అడ్డుకోవటం.