అరకు నియోజకవర్గం ఎంఎల్ఏ కిడారి సర్వేశ్వరరావుతో పాటు మాజీ ఎంఎల్ఏ సివెరి సోమ హత్య కేసులో పోలీసులు పురోగతి సాధించారు. గ్రామదర్శిని కార్యక్రమంలో పాల్గొన్న ఎంఎల్ఏతో పాటు మాజీ ఎంఎల్ఏని ఆదివారం మధ్యాహ్నం మావోయిస్టులు హత్య చేసిన సంగతి అందరికీ తెలిసిందే. కారులో వెళుతున్న ఇద్దరినీ మావోయిస్టులు అటకాయించి వాహనాన్ని ఆపేసి వారిని కారులో నుండి బయటకు దింపారు. తర్వాత పక్కకు తీసుకెళ్ళి దాదాపు గంటసేపు మాట్లాడిన తర్వాత ఒక్కసారిగా బుల్లెట్ల వర్షం కురిపించారు. వారిద్దరి చేతులు వెనక్కు కట్టేసి పాయింట్ బ్లాంక్ లో తుపాకులను ఉంచి మరీ కాల్చేయటం సంచలనం కలిగించింది.
ఎప్పుడైతే సంఘటన జరిగిందో సాయంత్రం నుండి పోలీసులు గాలింపు చర్యలు మొదలుపెట్టేశారు. అటవీ ప్రాంతంలోని అణువణువు గాలించటానికి గ్రేహౌండ్స్ దళాలు రంగంలోకి దిగాయి. ఎంఎల్ఏని, మాజీ ఎంఎల్ఏని కారులో నుండి దింపి తీసుకెళ్ళే క్రమంలో వాహనంలోని కారు డ్రైవర్ తో పాటు గన్ మెన్లతో కూడా మావోయిస్టులు మాట్లాడారు. మొత్తం 60 మావోయిస్టులు యాక్షన్ లో పాల్గొంటే అందులో సగంమంది మహిళా మావోయిస్టులే ఉండటం ఆశ్చర్యం.
సరే ఆ విషయాన్నిపక్కనబెట్టేస్తే మావోయిస్టులు మాట్లాడిన తర్వాత ఘటన విషయాన్ని సిబ్బందే ఉన్నతాధికారులకు తెలియజేశారు. కాబట్టి సిబ్బంది ఇచ్చిన ఆనవాళ్ళ ప్రకారం పోలీసు ఉన్నతాధికారులు కొందరు మావోయిస్టులపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అందులో ముగ్గురు మావోయిస్టలు ఫొటోలను విడుదల చేశారు. ముగ్గురు ఫొటోలను విడుదల చేయటంతో హత్య ఘటనపై పోలీసులు ఎంతో కొంత పురోగతిని సాధించినట్లే కనిపిస్తోంది.