ఖమ్మం జిల్లాలో కానిస్టేబుల్ ఆత్మహత్య కలకలం రేపుతోంది. ఈ వార్త ఖమ్మం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. కానిస్టేబుల్ ఆత్మహత్యకు పాల్పడడం పోలీసు వర్గాల్లోను, జిల్లాలోనూ కలకలం రేపుతోంది. గత కొంతకాలంగా ఏదొకచోట పోలీసుల ఆత్మహత్యల ఘటనలు వింటూనే ఉన్నాం. అధికారుల టార్చర్ తాళలేక మరణించినట్లు కొన్ని ఘటనల్లో వినిపిస్తే కొన్ని కేసుల్లో కుటుంబ వ్యవహారాలే కారణంగా తెలుస్తున్నాయి. ప్రస్తుతం ఖమ్మ జిల్లాలో జరిగిన ఘటన వివరాలిలా ఉన్నాయి.
ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం గంగారంలో చోటు చేసుకుంది ఈ ఘటన. పునేం శ్రీనివాస్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్నాడు. ఇతని స్వస్థలం చర్ల మండలంలోని పూజారిగూడెం. ప్రస్తుతం గంగారంలోని 15 బెటాలియన్ డ్యూటీలో ఉన్నాడు. అయితే ఒక్కసారిగా కానిస్టేబుల్ తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకోవడం సంచలనంగా మారింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభత్వాసుపత్రికి తరలించారు.
కుటుంబ సభ్యులు శ్రీనివాస్ మరణవార్త విని రోదిస్తున్నారు. సహచర ఉద్యోగులు శ్రీనివాస్ మృతిపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆయన మృతిపై పోలీసులు విచారణ చేపట్టారు. కుటుంబ కలహాల వల్లే శ్రీనివాస్ ఆత్మహత్యకు పాల్పడినట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దీనిపై విచారణ చేపట్టిన అధికారులు ఆ దిశగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.