పోలింగ్ బూత్ లోకి ప్రవేశించి మరీ ఓ అభ్యర్ధి ఈవిఎం మెషీన్ ను పగలగొట్టారు. అనంతపురం జిల్లాలోని గుంతకల్ నియోజకవర్గంలో జననసేన తరపున మధుసూదనగుప్తా పోటీ చేస్తున్నారు. పోలింగ్ ప్రారంభమైన కొద్దిసేపటికే గుప్తా తన మద్దతుదారులతో పోలింగ్ కేంద్రంలోకి ప్రవేశించారు. పోలింగ్ అధికారులతో వాగ్వాదానికి దిగారు. తర్వాత ఏమైందో ఏమో ఒక్కసారిగా అక్కడే ఉన్న ఈవిఎంను చేతిలోకి తీసుకుని నేలపైకి విసిరి కొట్టారు. దాంతో ఈవిఎం పగిలిపోయింది.
నిజానికి జనసేనకు గెలిచే అవకాశం ఎక్కడా కనబడటం లేదు. ఏదో పోటీలో ఉందంటే ఉందన్నట్లుగా ఉంది పరిస్ధితి. జనసేన అధినేత పవన్ కల్యాణ్ కే రెండు చోట్ల గెలుపు అవకాశాలు లేవనే ప్రచారం జరుగుతోందంటేనే పార్టీ పరిస్ధితి ఎలాగుందో అర్ధమైపోతోంది. అయితే ఎక్కడైనా నియోజకవర్గాల్లో గట్టి అభ్యర్ధులు అనుకున్న చోట మాత్రం కాస్త హడావుడి ఎక్కువగా జరిగింది.
అలాంటి నియోజకవర్గాల్లో గుంతకల్ కూడా ఒకటి. ముందు వైసిపి తర్వాత టిడిపి టికెట్ కోసం గుప్తా గట్టిగా ట్రై చేసుకున్నారు. కానీ సాధ్యం కాలేదు. దాంతో చివరగా జనసేన టికెట్ దక్కించుకున్నారు. మాజీ ఎంఎల్ఏ కూడా అయిన గుప్తాకు ఆర్ధిక, అంగ బలం పుష్కలంగా ఉంది. దాంతో పై రెండు పార్టీలకు ధీటుగా ప్రచారం నిర్వహించారు. ప్రచారం చేయటం వరకే గుప్తా చేతిలో ఉంది. ఓట్లు వేయించుకోవటం మాత్రం లేదు కదా?
మరి పోలింగ్ మొదలవ్వగానే ఏమైందో ఏమో గుంతకల్ పట్టణంలోని 183వ పోలింగ్ కేంద్రంలోకి వెళ్ళి అధికారులతో వాగ్వాదం పెట్టుకుని ఈవిఎంను పగలగొట్టారు. సరే పోలీసులు వచ్చి బలవంతంగా జీపులోకి ఎక్కించుకుని పోలీస్టేషన్ కు తరలించారు. మొత్తానికి ఉదయమే గుప్తా వార్తల్లోకి ఎక్కారన్నమాట.