మూఢనమ్మకాలతో ఆరేళ్ల బాలుడిని బలి చేసిన దుండగులు.. అదుపులోకి తీసుకున్న పోలీసులు!

దేశం రోజురోజుకి ఎంత అభివృద్ధి చెందిన కూడా మూఢనమ్మకాలు మాత్రం ఇప్పటికీ కొనసాగుతున్నాయి. ఈ మూఢ నమ్మకాల వల్ల కొంతమంది బలి ఇవ్వాలని దారుణాలకు పాల్పడుతున్నారు. తాజాగా ఢిల్లీలో కూడా ఇటువంటి దారుణ సంఘటన చోటుచేసుకుంది. సంపద లభిస్తుందని భావించి ఇద్దరు దుర్మార్గులు ఆరేళ్ల బాలుడిని దారుణంగా హత్య చేసిన ఘటన ఢిల్లీలో కలకలం రేపుతోంది.

వివరాలలోకి వెళితే…దక్షిణ ఢిల్లీ లోధి కాలనీలోని మురికివాడలో నివాసముంటున్న అజయ్ కుమార్ అమర్ కుమార్ అనే ఇద్దరు వ్యక్తులు తరచు పూజలు నిర్వహిస్తూ ఉండేవారు. ఈ క్రమంలో శనివారం కూడా వారు నివసిస్తున్న గుడిసెలో పాటలు పాడుతూ పూజలు నిర్వహించారు. ఉత్తరప్రదేశ్ కి చెందిన ఒక కుటుంబం కూడా అక్కడ నివసిస్తోంది. ఈ క్రమంలో ఆ కుటుంబానికి చెందిన ఆరేళ్ల బాలుడు శనివారం పూజకు హాజరయ్యాడు.పూజ ముగిసిన తర్వాత ఎంతసేపటికి బాలుడు ఇంటికి తిరిగి రాకపోవడంతో తండ్రి బాలుడు కోసం చుట్టుపక్కల ప్రాంతాలలో వెతకటానికి వెళ్ళాడు.

ఈ క్రమంలో అమర్ ,అజయ్ కుమార్ ఇంటి నుండి రక్తపు ధారలు వస్తున్న సంగతి గమనించిన బాలుడి తండ్రి లోపలికి వెళ్లి చూడగా అక్కడ తన కుమారుడు రక్తపుమడుగులో విగత జీవిగా కనిపించాడు. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అమర్, అజయ్ ని అదుపులోకి తీసుకొని విచారించగా సంపద వస్తుందని దేవుడు చెప్పాడు.. అందువల్లే బాలుడిని కత్తితో గొంతు కోసి నరబలి ఇచ్చామని అంగీకరించారు
దీంతో పోలీసులు వారి మీద కేసు నమోదు చేసుకుని ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.