పోలవరం ప్రాజెక్టు అంటే, అది ఆంధ్రప్రదేశ్ జీవనాడి.! కానీ, ఈ ప్రాజెక్టు విషయంలో ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికిగానీ, అటు కేంద్ర ప్రభుత్వానికిగానీ చిత్తశుద్ధి కనిపించడంలేదు. వాస్తవానికి, పోలవరం జాతీయ ప్రాజెక్టు. అలాంటప్పుడు, రాష్ట్ర ప్రభుత్వం, ఈ ప్రాజెక్టు విషయంలో పెత్తనం చేసి ప్రయోజనం లేదు.
ఉమ్మడి తెలుగు రాష్ట్రం విభజనకు ముందు రాష్ట్ర ప్రాజెక్టుగా ప్రారంభమైన పోలవరం, ఉమ్మడి తెలుగు రాష్ట్రం విభజనతో జాతీయ ప్రాజెక్టుగా మారింది. అందుకే, రాష్ట్ర ప్రభుత్వమే ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని కొనసాగిస్తోంది. కేంద్రం, ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని పర్యవేక్షించడంతోపాటు, జాతీయ ప్రాజెక్టు గనుక.. పూర్తి నిధుల్ని అందించాల్సి వుంది.
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సఖ్యత బాగానే వున్నా, పోలవరం ప్రాజెక్టు పనులు గడచిన తొమ్మిదేళ్ళలో పూర్తవలేదు. భవిష్యత్తులో పూర్తవుతుందన్న నమ్మకమూ కనిపించడంలేదు. 2025 ఆగస్ట్ నాటికి.. అంటూ తాజాగా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పోలవరం ప్రాజెక్టు పూర్తవడంపై డెడ్‌లైన్ ప్రకటించారు.
నిజానికి, కేంద్రమే డెడ్‌లైన్ ప్రకటించాలి. రాష్ట్రం ఎంత గింజుకున్నా ప్రయోజనం లేదు. గతంలో చంద్రబాబు, ఇప్పుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. ఇద్దరూ ఇద్దరే..! ఇద్దరికీ సొంత పబ్లిసిటీ తప్ప, ప్రాజెక్టు మీద మమకారం కనిపించడంలేదన్న విమర్శ వుంది. టీడీపీ, వైసీపీ మాత్రమే కాదు, జనసేన కూడా.. పోలవరం ప్రాజెక్టు విషయమై కేంద్రాన్ని ప్రశ్నించే పరిస్థితి లేదు. బీజేపీకి జనసేన మిత్రపక్షం గనుక.
ఇలా అయితే ఎలా.? రాష్ట్ర ప్రయోజనాల కోసం రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పార్టీలన్నీ ఒక్కతాటిపైకి రాలేవా.? అంటే, ఆ ఛాన్సే లేదు. ఏ పార్టీకి ఆ పార్టీ.. తమ రాజకీయ ప్రయోజనాలే ముఖ్యమనుకుంటున్నాయి రాష్ట్ర పయోజనాల కంటే మిన్నగా.!
తన తండ్రి ప్రారంభించిన ప్రాజెక్టుని తానే పూర్తి చేస్తానని జగన్ గతంలో చెప్పడమే హాస్యాస్పదం. జాతీయ ప్రాజెక్టు విషయంలో ఇలాంటి ప్రకటన చేసి వైఎస్ జగన్ తొందరపడ్డారు. ఇప్పుడు చేతులెత్తేసి అభాసుపాలవుతున్నారు.