ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరోసారి ఆంధ్రప్రదేశ్ పర్యటనకు రాబోతున్నారు. జూన్ 21న విశాఖపట్నంలో జరగనున్న 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు. ఇటీవలే అమరావతిలో జరిగిన సభలో మోదీ ఈ కార్యక్రమానికి హాజరవుతానని స్వయంగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పుడు కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ, రాష్ట్ర ప్రభుత్వ సంయుక్త ఆధ్వర్యంలో విశాఖలో ఈ మహావేదికను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు మొదలయ్యాయి.
ఈ నేపథ్యంలో బుధవారం విజయవాడలోని సీఎస్ క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. కార్యక్రమానికి సుమారు రెండు లక్షల మంది హాజరవ్వనున్న నేపథ్యంలో అన్ని శాఖల సమన్వయంతో పటిష్ట ఏర్పాట్లు చేయాలని సూచించారు. విద్యార్థులు, యోగా శిక్షకులు, ప్రభుత్వ ఉద్యోగులు, స్పోర్ట్స్ కోచ్‌లు వంటి విభిన్న వర్గాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలను కార్యక్రమంలో పాల్గొనించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
“యోగా ఫర్ వన్ ఎర్త్, వన్ హెల్త్” అనే నినాదంతో జరిగే ఈ వేడుకలు రాష్ట్రం పర్యాటక, వైద్య, విద్యా రంగాల ప్రాధాన్యాన్ని కూడా చాటనున్నాయి. దేశవ్యాప్తంగా 100 నగరాల్లో యోగా ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్న తరుణంలో విశాఖ వేదికపై ప్రధానమంత్రి పాల్గొనడం రాష్ట్రానికి గౌరవకారణంగా మారనుంది. కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ ఈ కార్యక్రమానికి అవసరమైన యోగా మ్యాట్స్, టి షర్ట్లు పంపనుంది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం “యోగాంధ్ర 2025” పేరిట ప్రత్యేక ప్రచారాన్ని కూడా చేపట్టనుంది.
ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ఎంఎస్‌ఎంఇ, ఐటీ, పీఆర్, విద్యా, వైద్య ఆరోగ్య శాఖల సమన్వయం కీలకమవుతుంది. కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ సహకారంతో ఈవెంట్ మేనేజ్‌మెంట్‌ను త్వరలో ఖరారు చేయనున్నారు. ప్రధాని మోదీ పర్యటనతో విశాఖలో మరోసారి జాతీయ స్థాయిలో దృష్టి సారించబోతోందని అధికారులు భావిస్తున్నారు.