విశాఖపట్నంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ప్రధాని నరేంద్ర మోడీ మధ్య భేటీ జరిగింది. ఈ భేటీకి సంబంధించి జరుగుతున్న దుష్ప్రచారంపై స్పందించాల్సిన అవసరం లేదని జనసేన కీలక నేతల్లో ఒకరైన నాదెండ్ల మనోహర్ తాజాగా వ్యవహరించారు.
అయితే, నాదెండ్ల మనోహర్ వ్యాఖ్యలు ఇంకో రకంగా వక్రీకరించబడుతున్నాయి.. అదీ అధికార వైసీపీ కారణంగా. జనసేనతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేస్తామంటోంది బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో.. కానీ, జనసేన మాత్రం తామే అధికారంలోకి వస్తామంటోంది.. అంటే, ఇక్కడ బీజేపీని జనసేన లెక్క చేయడంలేదన్నమాట.. అంటూ వైసీపీ నేతలు వక్రభాష్యాలు చెబుతున్నారు. అయినా, జనసేన – బీజేపీ కలిసి వున్నా, విడిపోయినా వైసీపీకి వచ్చే నష్టమేంటి.? టీడీపీకి జనసేన దాదాపు దూరమైనట్లే. సో, వైసీపీ కాస్త సంతోషించాల్సిన విషయం. కానీ, వైసీపీ నేతల హంగామా మాత్రం తగ్గడంలేదు. అయితే, రాజకీయాల్లో ఇవన్నీ మామూలే.
అధికార పార్టీ గనుక, అన్ని పార్టీల గురించీ మాట్లాడాలి.. పైగా, సమీప భవిష్యత్తులో తమకు రాజకీయ ప్రత్యర్థి ఎవరూ వుండకూడదని భావించడంతోనే.. ‘చిన్న పాముని అయినా పెద్ద కర్రతో కొట్టాలన్న’ ఆలోచన చేస్తున్నటుంది వైసీపీ.
ఇదిలా వుంటే, ఎన్నికల వరకు బీజేపీ – జనసేన ఎవరిదారిలో వాళ్ళు వెళ్ళాలి.. టీడీపీ అయినాసరే.. అదే పద్ధతి. ఎన్నికల సమయంలో మాత్రమే పొత్తుల గురించి మాట్లాడుకోవచ్చని జనసేనానితో ప్రధాని చెప్పారన్నది తాజా ఖబర్. దాంతో, ‘మేమే అధికారంలోకి వస్తాం..’ అనే నినాదాన్ని జనసేనాని గట్టిగా వినిపిస్తున్నారట. ఈ విషయం ఎలా లీక్ అయ్యిందోగానీ, ఆ ముగ్గురూ కలుస్తారన్న గట్టి నమ్మకంతోనే, ముగ్గురి మధ్యా చిచ్చపెట్టాలని వైసీపీ చూస్తోంది.