మూడు రాజధానుల ఏర్పాటకు ప్రభుత్వం ఫిక్స్ అయిన నేపథ్యంలో అమరావతి రాజధాని రైతుల ఆగ్రహాన్ని తగ్గించేందుకు సన్నాహాలు చేస్తోంది. 30 రోజులకు పైగా వివిధ రకాల ఆందోళనలతో రాజధాని ప్రాంత రైతులు అనేక వర్గాల నుంచి సింపతిని పొందుతున్నారు. రైతులను శాంతింపజేసేందుకు ప్రభుత్వం అనేక మార్గాలను అన్వేషించింది. రాజధాని పరిధిలో భూమిలిచ్చిన రైతులకు ఎకరాకు అదనంగా మరో 200 గజాల స్థలం ఇవ్వడం కొత్త ప్రతిపాదనల్లో ఒకటి. రాజధాని ప్రాంతాన్ని గ్రేటర్ అమరావతిగా ఏర్పాటుకు కూడా సిద్ధంగా ఉన్నట్లు మరో ప్రచారం జరుగుతోంది. రాజధానిని తరలించినా ఈ ప్రాంతానికి ప్రత్యేక గుర్తింపు ఇవ్వాలని భావిస్తున్నారు. ప్రస్తుతం రాజధాని అమరావతి పరిధిలోని మూడు మండలాల పరిధిలో 31 గ్రామాలను వేరు చేసి కార్పొరేషన్‌గా ఏర్పాటుకు సన్నాహాలు జరగుతున్నాయి. తుళ్లూరు మండలంలో 20 గ్రామాలు, తాడేపల్లి మండలంలో రెండు, మంగళగిరి మండలలో 9 గ్రామాలను కార్పొరేషన్‌లో కలిసే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం రాజధాని ప్రాంతం అంతా సీఆర్‌డీఏ పరిధిలో ఉంది. ఏపీ సీఆర్‌డీఏను రద్దు చేసి దాని స్థానంలో వీజీటీఎం ఉడాను పునరుద్ధరించాలని ప్రతిపాధించారు. త్వరలో జరగనున్న అసెంబ్లీ సమావేశాల్లో ఈ ప్రతిపాదనకు చట్టరూపం దాల్చే అవకాశం ఉంది. అయితే అమరావతి కార్పొరేషన్ ఏర్పాటుకు, దాని పరిధిని నోటిఫై చేయాలి. ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరించిన తరువాత పూర్తి స్థాయిలో నోటిఫికేషన్ జారీ చేయాలి. రాజధాని అమరావతి ప్రాంతాన్ని కార్పొరేషన్‌గా చేస్తే 40 ఎంపీటీసీ స్థానాలు, 31 గ్రామ పంచాయతీలు రద్దవుతాయి. వరుసగా జరుగుతున్న హైపవపర్ కమిటీల్లో కూడా దీనిపై చర్చ జరుగుతున్నట్లు తెలుస్తోంది.