పీతల సుజాత.. టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో ఓ వెలుగు వెలిగిన నేత. అనుకోకుండా చివరి నిముషం లో చింతలపూడి సీటు దక్కించుకుని గెలిచిన పీతల సుజాత వెంటనే మంత్రిగా ఎంపికైయ్యారు. మంత్రిగా మూడేళ్ల పాటు ఉన్నా నియోజకవర్గంలో మరో వర్గం సుజాతను ఏ మాత్రం ప్రశాంతంగా ఉండనీయలేదు. నియోజకవర్గంలో గ్రూపు రాజకీయాలు ప్రోత్సహిస్తూ పీతల సుజాతను పూర్తిగా డిస్టర్బ్ చేశారు. వీళ్లకు చింతమనేని ఎంకరేజ్‌మెంట్ కూడా ఉండడంతో సుజాత మంత్రి పదవి మూడేళ్లకే ముగిసింది.
ఆ తర్వాత రెండేళ్లు ఎమ్మెల్యేగా మాత్రం ఆమె స్పీడప్ అయ్యి నియోజకవర్గంలో తన కేడర్ ను కాపాడుకున్నారు. అయితే , ఆ గ్రూప్ రాజకీయాలతో సుజాత అష్టకష్టాలు పడటంతో గత ఎన్నికల్లో చంద్రబాబు అప్పటి సుజాత వ్యతిరేక వర్గానికి తలొగ్గి ఆమెను పక్కన పెట్టి కర్రా రాజారావుకు సీటు ఇచ్చారు. ఎన్నికల్లో కర్రా 36 వేల ఓట్ల తేడాతో చిత్తుగా ఓడారు. ఎన్నికలకు ముందే అవుట్ డేటెడ్ లీడర్ అయిపోయిన కర్రా ఎన్నికల్లో ఓటమి తర్వాత సైలెంట్ అవ్వడంతో పాటు పార్టీని పటిష్టం చేసే చర్యలు కూడా తీసుకోలేదు. వయోః భారంతో పాటు అనారోగ్య సమస్యలు ఉండడంతో తిరిగి ఆయన రాజకీయంగా యాక్టివ్ అయ్యే పరిస్థితి లేదు.
ప్రస్తుత ఇన్‌చార్జ్ రాజారావు మళ్లీ క్రియాశీలకంగా యాక్టివ్ అయ్యే పరిస్థితి లేకపోవడంతో మళ్లీ పీతల సుజాతతో పాటు ఆమె వర్గం నేతలు యాక్టివ్ అవుతున్నారు.గత ఎన్నికల్లో సీటు రాకపోయినా పీతల సుజాత మాత్రం నియోజకవర్గంలో పార్టీ కేడర్‌కు అందుబాటులో ఉంటున్నారు. కరోనా సమయంలో నియోజకవర్గంలో పార్టీ నేతలను ఎవ్వరూ పట్టించుకోకపోయినా సుజాతే ఆదుకున్నారు. ప్రస్తుతం నియోజకవర్గ టీడీపీలో ఏర్పడిన రాజకీయ శూన్యతను భర్తీ చేసేందుకు పీతల సుజాత అయితేనే కరెక్ట్ అని పార్టీ నేతలు భావిస్తున్నారు. ఇక గత ఎన్నికల్లోలా చంద్రబాబు ఒత్తిళ్లకు తలొగ్గి టిక్కెట్లు ఇచ్చే పరిస్థితి లేకపోవడంతో పీతల సుజాతకు చింతలపూడిలో మళ్లీ లైన్ క్లీయర్ అవుతోన్న పరిస్థితి కనిపిస్తోంది.