Perni Nani: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైకాపా నాయకులు కార్యకర్తలపై అనవసరంగా కేసులు పెట్టి వారిని చిత్రహింసలకు గురి చేస్తున్న సంగతి తెలిసిందే. ఇలా అక్రమ అరెస్టులపై వైకాపా నేతలు తీవ్ర స్థాయిలో మండిపడుతూ చంద్రబాబు లక్ష్యంగా చేసుకొని విమర్శలు చేస్తున్నారు. తాజాగా మాజీమంత్రి పేర్ని నాని ఈ విషయంపై ఘాటుగా స్పందించారు.
అధికారం అనేది ఎవరికి శాశ్వతం కాదు.. ఈ విషయాన్ని చంద్రబాబు అండ్ టీం అలాగే పోలీసులు కూడా గుర్తుపెట్టుకోవాలని పేర్ని నాని చెప్పారు. కొంతమంది పోలీసులు వారు చేస్తున్న తప్పుకు పశ్చాత్తాప పడుతుండగా మరి కొంతమంది మాత్రం పచ్చ చొక్కాలు వేసుకొని విధులు నిర్వహిస్తున్నారని మండిపడ్డారు.
ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఎవరూ కూడా వైసీపీ జెండా పట్టుకుని తిరగకుండా చేస్తున్నారని ఈయన మండిపడ్డారు. ఎప్పుడు పాత కేసులన్నింటినీ కూడా తిరగదోడి అమాయకులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని అయితే అధికారం ఎప్పుడు మీకే ఉండదు తదుపరి మా ప్రభుత్వం వచ్చిన తరువాత ఇప్పుడు చేసిన తప్పులకు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని ఎవరూ కూడా తప్పించుకోలేరు అంటూ పేర్ని నాని వార్నింగ్ ఇచ్చారు.
గన్నవరంలో 8 మంది వైసీపీ నేతలను అక్రమంగా కేసుల్లో ఇరికించారని ఆగ్రహం వ్యక్తం చేసారు. న్యాయమూర్తి 307 కేసును తొలగించారని చెప్పారు. రెండు సార్లు విచారణ అయ్యాక ఏముందని పోలీస్ కస్టడీకి కోరుతున్నారని పేర్ని నాని ప్రశ్నించారు. ప్రభుత్వాన్ని వైసీపీ నేతలు, కార్యకర్తలు ప్రశ్నిస్తే వారిని టార్గెట్ చేయటమే పనిగా పెట్టుకుందని ఆరోపించారు. తప్పుడు కేసులతో వైసీపీ శ్రేణులను వేధించటం కోసమే పోలీసు వ్యవస్థను వినియోగిస్తున్నారని , రాష్ట్రవ్యాప్తంగా శాంతిభద్రతలను గాలికి వదిలేసారు అంటూ ఈయన ఆగ్రహం వ్యక్తం చేసారు.