వారాహి యాత్ర 3.0లో భాగంగా వైసీపీ ప్రభుత్వంపైనా, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పైనా పవన్ కల్యాణ్ చేస్తోన్న విమర్శలపైనా, పవన్ వ్యవహారశైలిపైనా మాజీ మంత్రి పేర్ని నాని తనదైన శైలిలో స్పందించారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. పవన్ పరిస్థితిని అర్ధం చేసుకోవాలని ఆయన అభిమానులకు సూచించారు.
అవును… ఒక సామాజిక వర్గాన్ని రెచ్చ గొట్టి, వాళ్ళని పొట్లం కట్టి చంద్రబాబుకి అమ్మెస్తావ్ అని తెలుసు అంటూ పవన్ పై మండిపడిన పేర్ని నాని… జనసేన పోటీ చేసేది 25 నుంచి 30 సీట్లు లోపు మాత్రమేనని జోస్యం చెప్పారు. పార్లమెంట్ కి ఒక సీటు చొప్పున పోటీ చేసి సీఎం అవుతావా పవన్.. అంటూ ఎద్దేవా చేశారు!
పవన్ వి దగాకోరుమాటలు అని, సినిమా గ్లామర్ తో పవన్ ప్రజలను మోసం చేస్తున్నారని దుయ్యబట్టిన పేర్ని నాని.. ఇకనైనా చిరంజీవిని చూసి నేర్చుకో అంటూ హితవుపలికారు. రాజకీయాలు తనకు సరిపడవు అని చిరంజీవి సినిమాలు చేసుకుంటున్నారని.. పవన్ కూడా చేసుకుంటే బెటర్ అని హితబోధ చేశారు.
ఇదే సమయంలో వైసీపీ వాళ్లను చేర్చుకోను అని గతంలో చెప్పిన పవన్… ఇప్పుడు బస్టాప్ లో టాటా మ్యాజిక్ మాదిరి ఎవరు వస్తే వాళ్లను ఎక్కించుకు వెళ్తాం అని చెప్పుకుంటున్నారని తనదైన మార్కు సెటైర్స్ వేశారు. ఇదే క్రమంలో… తెనాలిలో నాదెండ్ల పోటీ చేస్తారంటున్నారు.. గుంటూరులో మిగతా సీట్లలో పోటీ చేయరా? అని పేర్ని ప్రశ్నించారు.
కేంద్రం సాయంతో సీఎం జగన్‌ను ఆటాడించే సత్తా ఉన్నవారైతే.. విశాఖ స్టీల్‌ప్లాంట్ గురించి ఎందుకు మాట్లాడరని ప్రశ్నించారు. తీసుకున్న ప్యాకేజీకి న్యాయం చేయడానికి పవన్ అలా మాట్లాడతారని ఎద్దేవా చేశారు. 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు, తాను అందించిన పాలన మళ్లీ తెస్తామని చెప్పే ధమ్ముందా అంటూ సవాల్ విసిరారు!