స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో అరెస్టై ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న చంద్రబాబును ఈ రోజు ములాకత్ లో భాగంగా జనసేన అధినేత పవన్ కల్యణ్ కలిసిన సంగతి తెలిసిందే. ములాకత్ అనంతరం టీడీపీ – జనసేన పొత్తును కన్ ఫాం చేశారు. దీంతో వైసీపీ నేతల నుంచి తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్న నేపథ్యంలో… తాజాగా మాజీ మంత్రి పేర్ని నాని తనదైన శైలిలో స్పందించారు.
రాబోయే ఎన్నికల్లో టీడీపీ, జనసేనా కలిసే పోటీ చేస్తాయని… ఎన్నికలు ఆరునెలల తర్వాత జరిగినా, రేపే జరిగినా.. పోత్తు కన్ ఫాం అని కుండబద్దలు కొట్టారు. ఈ విషయంపై తాజాగా మాజీ మంత్రి, బందరు ఎమ్మెల్యే పేర్ని నాని తనదైన శైలిలో స్పందించారు. హిందూ అయిన పవన్ కల్యాణ్… పొత్తు విషయంపై అమావాస్య నాడే నిర్ణయం తీసుకోవడం ఏమిటి.. సంపూర్ణ అమావాస్య నాడే ప్రకటించడం ఏమిటని అన్నారు.
ఇదే సమయంలో చంద్రబాబును ఓదార్చడం కోసం పవన్ రాజమండ్రి సెంట్రల్ జైలుకి వెళ్లాడనుకున్నామని, అయితే చంద్రబాబుతో బేరం మాట్లాడ్డానికి వెళ్లాడనుకోలేదని మాజీ మంత్రి పేర్ని నాని దుయ్యబట్టారు. ఇదే క్రమంలో చంద్రబాబుతో ములాఖత్ కాదు.. మిలాఖత్ అని తేలిందని ఎద్దేవా చేశారు. బీజేపీతో పవన్ ది తాత్కాలిక పొత్తు మాత్రమే అని, తెలుగుదేశంతోనే పవన్ కు శాశ్వతపొత్తు అని స్పష్టం చేశారు.
అనంతరం అవినీతిపై రాజీలేని పోరాటం అనిచెప్పుకునే పవన్.. ప్రజాధనం దోచుకున్న దొంగను పరామర్శిస్తాడా.. ఇదేనా పవన్ చెప్పిన జనసేన సిద్ధాంతం.. తాను దోచుకున్న డబ్బులో లోకేష్ వాటా ఇస్తానని చెప్పాడా.. లోకేష్ తో సీట్లేనా లేక లెక్కలు కూడా పంచుకున్నారా.. అంటూ ప్రశ్నలతో ఉక్కిరిబిక్క్రి చేసినంతపనిచేసిన పేర్ని నాని… తనను నమ్ముకున్న వారిని మోసం చేసి పవన్ లాభపడుతున్నాడని అన్నారు.