స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో అరెస్టైన చంద్రబాబు మూడు వారాలుగా రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న సంగతి తెలిసిందే. దీంతో… చంద్రబాబు అరెస్టై మూడు వారాలు పూర్తవుతున్నందుకో ఏమో కానీ… వినూత్నమని చెబుతూ “మోత మోగిద్దాం” అనే కార్యక్రమం తలపెట్టింది టీడీపీ. దీంతో… ఆ కార్యక్రమంతో పాటు తాజా రాజకీయ పరిస్థితులపై తాజాగా స్పందించారు పేర్ని నాని.
ఈ సందర్భంగా మోతమోగిద్దాం కార్యక్రమంపై స్పందించిన పేర్ని నాని… టీడీపీ తాజాగా నిర్వహించిన మోత కార్యక్రమానికి స్పందన లేదని అన్నారు. కాపులకు రిజర్వేషన్లు ఇస్తామని మోసం చేసిన చంద్రబాబు.. ముద్రగడ పద్మనాభం నిరసనకు దిగి, అందులో భాగంగా కాపుల ఆకలి కేకలు ప్రభుత్వానికి వినపడేలా కంచాలపై గరిటెలతో కొట్టాలని పిలుపునిచ్చారు. ఆ సమయంలో ఆ కార్యక్రమాన్ని ఎద్దేవా చేసిన బాబు… నిరసనకారులపై కేసులు పెట్టారు.
సరిగ్గా అదే విషయాన్ని గుర్తుచేసిన పేర్ని నాని… ప్రజల సొమ్ము దోచేసిన వ్యక్తి కోసం ఇలా రోడ్లపైకి వచ్చి కంచాలు కొట్టండి, విజిల్స్ వేయండి, గంటలు వాయించండి అని చెప్పడాన్ని ఎద్దేవా చేశారు. పైగా ఆ కార్యక్రమంలో పాల్గొన్న ఎవరిలోనూ చంద్రబాబు లోపల ఉన్నారనే బాధ లేదని… నవ్వుతూ పాల్గొన్నారని అన్నారు.
ఇదే సమయంలో… చంద్రబాబు తమ సొమ్ము తినేశాడని సామాన్య ప్రజానికంతోపాటు, టీడీపీ కార్యకర్తలు కూడా భావించారు కాబట్టే ఆ కార్యక్రమానికి స్పందన రాలేదని తెలిపారు. ఇదే సమయంలో చేసిన పాపం పండిందని… ఇక బాబు సిద్ధంగా ఉండాలని సూచించారు. మింగేసిన ప్రజల సొమ్మును తిరిగి ఖజానాకు జమ చేస్తే దేవుడు క్షమిస్తాడని అన్నారు.
జగన్ మోహన్ రెడ్డికి భయం అంటే ఏమిటో చూపించే బాధ్యత ఈ లోకేష్ తీసుకుంటాడు అని చెప్పిన వ్యక్తి.. ఇన్నర్ రింగ్ రోడ్ స్కాం కేసులో ఏ-14గా సీఐడీ చేర్చేసరికి… ముందస్తు బెయిల్ కోసం ట్రై చేసి, ఈ లోపు ఢిల్లీలో మకాం పెట్టాడని అన్నారు. ఆయన మాటలు విని కేసులు పెట్టించుకున్నవారు మాత్రం ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. చంద్రబాబుకి పెద్ద పదవి కావాలి కాబట్టి… జైల్లో ఎన్ని ఎక్కువ రోజులు ఉంటే అంత బెటరని ఎద్దేవా చేశారు.
ఇక… సీఐడీ అధికారులు ఇచ్చిన 41-ఏ నోటీసులను లవ్ లెటర్ తో లోకేష్ పోల్చడంపైనా… పేర్ని నాని స్పందించారు. తనదైన శైలిలో వెటకారమాడారు. లవ్ లెటర్ అక్టోబర్ 4 న డేటింగుకు రమ్మన్నారు కదా.. అది సెట్ అయితే తర్వాత వెడ్ లాక్ అని, అనంతరం హమీమూన్ అని… ఆ విషయం లోకేష్ కి కూడా తెలిసే ఉంటుందని అన్నారు. దీంతో… ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి!