వైఎస్ జగన్ ముఖ్యమంత్రి ఆయన దగ్గర్నుండి సంపద సృష్టి సంగతేమో కానీ ఉన్న ఆస్తులు కరిగిపోతున్నాయి. ఏ ఆర్థిక సమస్య తలెత్తినా ఎక్కడ భూములున్నాయి, వీటిని అమ్ముకోవచ్చనే ధోరణిలోనే ఉంది ప్రభుత్వం. అలవికాని రీతిలో సంక్షేమ పథకాలను అమలుచేస్తూ రాష్ట్ర ఖజానా మీద పెను భారం మోపుతున్న వైసీపీ సర్కార్ అది చాలదన్నట్టు భారీగా అప్పులు తెస్తోంది. రికార్డ్ స్థాయిలో రుణాలు లాక్కొచ్చారు. అప్పుల పరిధిని పెంచుకోవడానికి కేంద్రం విధిస్తున్న నిబంధనలకు తలొగ్గుతున్నారు. ఇవన్నీ చాలవన్నట్టు భూముల అమ్మకం ఒకటి. సంక్షేమం అమలుచేయడానికి నిధులు సమకూర్చుకోవాల్సి ఉంది కాబట్టి ఆస్తుల అమ్మకానికి దిగారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకోకుండా తెగనమ్ముతున్నారు. అవసరం కొద్దీ అరకొరగా అమ్మేసి రేపు కొనాల్సిన పరిస్థితి వస్తే అదే ప్రైవేట్ వ్యక్తుల నుండి నాలుగైదు రేట్లు ఎక్కువ చెల్లించి కొనుగోలు చేయాల్సిన పరిస్థితులను తెస్తున్నారు.
వైఎస్ జగన్ గారి వైఖరి చూసి అమ్మడం అంటే ఇంత సరదా ఏంటయ్యా అంటున్నారు జనం. తాజగా విశాఖ ఉక్కు పరిశ్రమను నష్టాల పేరుతో ప్రైవేట్ పరం చేయాలని కేంద్రం నిర్ణయించింది. అప్పుల్లో ఉన్న పరిశ్రమను ఆదుకోవడం కష్టమని, ప్రైవేట్ వ్యక్తుల చేతులో పెడితే వాళ్ళే చూసుకుంటారని అంటోంది. దీన్ని రాష్ట్రంలో అన్ని పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి. అందులో వైసీపీ కూడ ఉంది. మొదట్లో మౌనంగానే ఉన్న ఆ పార్టీ ఇప్పుడేదో కాస్త హడావుడి చేస్తోంది. చీటికీమాటికీ నిప్పులు చెరిగే ఫైర్ బ్రాండ్లు అందరూ విశాఖ ఉక్కు మీద నోరుమెదపలేదు. జనం నుండి విమర్శలు వెల్లువెత్తడంతో విజయసాయి రెడ్డి నిన్న బహిరంగసభ పెట్టారు. ఇవన్నీ పక్కనపెడితే అసలు సీఎం ఈ సమస్యకు ఎలాంటి పరిష్కారం చూస్తున్నారనేది ముఖ్యమైన అంశం.
అయితే అందరూ ఊహించుకుంటున్నట్టు ఇక్కడ పెద్ద పెద్ద పరిష్కార మార్గమేమీ లేదు. జస్ట్ ఎస్కెప్ అంతే. ప్రైవేటీకరణను ఆపాలి అంటే ముందు పరిశ్రమను నష్టాల్లో నుండి బయటకు తేవాలి. అలా తేవాలి అంటే డబ్బు కావాలి. ఆ డబ్బును స్టీల్ ప్లాంట్ భూములు అమ్మే తేవాలి అంటున్నారు సీఎం. పరిశ్రమకు మిగులు భూములు ఉన్నాయని, వాటిని ప్లాట్లు వేసి అమ్మేస్తే డబ్బులొస్తాయి, వాటితో నష్టాలూ పూడ్చుకోవచ్చనేది ఐడియా అన్నమాట. అసలు పరిశ్రమకు మిగులు భూములు ఉంటాయా అనేదే డౌట్. పరిశ్రమ చుట్టూ ఖాళీగా ఉన్న భూములను మిగులు భూములు అనుకుంటున్నారేమో. అవి మిగులు భూములు కాదు. ఎక్కువై పక్కనపడేసి భూములు అంతకంటే కాదు.
భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని అందుబాటులో ఉంచుకున్న భూములు. రేపు పరిశ్రమను విస్తరించాలంటే భూములు తప్పనిసరి. అప్పుడు జనం మీద పడి పీడించకుండా ముందుగానే మొదట్లో చేసిన భూసేకరణలోనే కొద్దిగా ఎక్కువ మొత్తంలో భూములు సేకరించి పెట్టారు. ఎక్కడైనా దూరదృష్టి కలవారి ఆలోచన ఇలాగే ఉంటుంది. కానీ జగన్ సార్ మాత్రం అవి ఊరికే పడున్నాయి కదా వెంచర్ వేసి అమ్మేద్దాం అంటున్నారు. మరి రేపు అవసరం వచ్చినప్పుడు ప్రైవేట్ వ్యక్తుల నుండి ఏం అమ్మి ఆ భూములు కొంటారో మరి.