పెళ్ళాల నుంచి.. ఇల్లాలిదాకా.! ఎందుకీ రచ్చ.?

‘నీకు సంస్కారం లేదు జగన్. నీ మానసిక స్థితి సరిగ్గా లేదు జగన్. భార్య అని గౌరవంగా పిలవాలి.. వేరేవారి భార్యల గురించిన ప్రస్తావన తెచ్చేటప్పుడు. పెళ్ళాం అంటావేంటి.?’ అంటూ పదే పదే జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి క్లాస్ తీసుకుంటున్న సంగతి తెలిసిందే.

రాజకీయ విమర్శల్లో భాగంగా దత్త పుత్రుడు, ప్యాకేజీ స్టార్.. వంటి పద జాలాన్ని ప్రయోగిస్తున్న వైఎస్ జగన్, వీలు చూసుకుని మరీ, ‘పవన్ కళ్యాణ్ పెళ్ళిళ్ళు.. పెళ్ళాల’ ప్రస్తావన తీసుకొస్తున్నారు. ఈ వ్యూహం ప్రతిసారీ బెడిసికొడుతూనే వుంది.

ఎవరో స్క్రిప్టు ఇస్తే, దాన్ని వైఎస్ జగన్ కేవలం చదివేస్తున్నారని జనసేన పార్టీనో, టీడీపీనో విమర్శించడం మామూలే. కానీ, వైసీపీలో ఆ పరిస్థితి వుంటుందా.? వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఎవరైనా సూచన చేయగలరా.? ఆయన్ని నిర్దేశించగలరా.?

కారణం ఏదైతేనేం, ఎవరి స్క్రిప్టు అయితేనేం.. వైఎస్ జగన్ మోహన్ రెడ్డిలో కొంత మార్పు అయితే వచ్చింది. ‘పెళ్ళాల ప్రస్తావన’ స్థానంలో, ‘ఇల్లాలి ప్రస్తావన’ వచ్చింది. అదీ, పవన్ కళ్యాణ్ గురించే. పేరు ప్రస్తావించలేదుగానీ, దత్త పుత్రుడు.. ప్యాకేజీ స్టార్ మాటల్ని అయితే యాజ్ యూజువల్‌గా వాడేశారు వైఎస్ జగన్.

కానీ, ఈ ‘ఇల్లాలి’ ప్రస్తావన వల్ల వైసీపీకి వచ్చే అదనపు లాభమేంటి.? జనసేన పార్టీకి వచ్చే అదనపు నష్టమేంటి.? ఈ విషయమై వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆత్మ విమర్శ చేసుకోవాల్సి వుంది. ఆయనేమీ సాదా సీదా రాజకీయ నాయకుడు కాదు. వైసీపీ అధినేత.. అందునా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి.

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సతీమణి గురించి అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తే ఏంటి పరిస్థితి.?