భారీ మెజారిటితో పెద్దిరెడ్డి విజయం

చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గంలో వైసిపి అభ్యర్ధి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఘన విజయం సాధించారు. టిడిపి అభ్యర్ధి అనూషారెడ్డిపై పోటి చేసిన పెద్దిరెడ్డి 47,200 ఓట్ల భారీ మెజారిటితో గెలిచారు. మొదటి నుండి  వైసిపి తరపున గెలిచే సీట్లలో పుంగనూరు నియోజకవర్గాన్ని మొదటి స్ధానంలోనే లెక్కేసుకున్నారు. అందరూ ఊహించినట్లే చివరకు విజయం పెద్దిరెడ్డినే వరించింది.

టిడిపి తరపున పోటీ చేసిన అనూషారెడ్డి ప్రత్యక్ష రాజకీయాలకు కొత్తే అయినా రాజకీయాలకు మాత్రం పాతే. ఫిరాయింపు మంత్రి అమరనాధరెడ్డికి అనూషా మరదలవుతుంది. నిజానికి పెద్దిరెడ్డి మీద పోటీ చేసేంత గట్టి అభ్యర్ధులు టిడిపిలో లేరు. అందుకే చంద్రబాబు ఏరికోరి మంత్రి మరదలు అనూషాను ఎంపిక చేశారు. ఆమె కూడా అభ్యర్ధి అయిన దగ్గర నుండి బాగా రెచ్చిపోయారు. పెద్దిరెడ్డి తనకు అసలు గట్టి పోటీనే కాదన్నారు.

ఆమె మాటలు విన్న టిడిపి నేతలే ఆశ్చర్యపోయారు. మామూలుగా తెలిసిన వాళ్ళెవరూ పెద్దిరెడ్డి గురించి అలా మాట్లాడరు. అదే సమయంలో అనూష తన గురించి ఎలా మాట్లాడినా పెద్దిరెడ్డి మాత్రం ఏమీ స్పందించలేదు. తన పనేదో తాను కామ్ గా చేసుకుపోయారు.  చివరకు ఫలితాలు చూస్తే అనూషే వైసిపి అభ్యర్ధి పెద్దిరెడ్డికి పోటీ కాదని తేలిపోయింది. లేకపోతే పెద్దిరెడ్డికి అనూష మీద 47 వేల మెజారిటీ ఎలాగ వస్తుంది ?