చిత్తూరు జిల్లా మంగళంపేట పరిధిలో 75 ఎకరాల అటవీ భూమిని అక్రమంగా ఆక్రమించారనే ఆరోపణలపై మాజీ మంత్రి, వైసీపీ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సుదీర్ఘ వివరణ ఇచ్చారు. తనపై వచ్చిన ఆరోపణలను నిర్ధారణ లేని అవాస్తవాలు అంటూ ఖండించారు. 2001లోనే భూమిని కొనుగోలు చేశామని, రెవెన్యూ సర్వే ప్రకారం అది అటవీ భూమి కాదని తెలిపారు. చంద్రబాబు ప్రభుత్వ హయాంలోనూ, కోర్టులోనూ ఈ భూమిపై దాఖలైన పిటిషన్లు రద్దు అయ్యాయని గుర్తు చేశారు.
అంతేకాదు, రహదారి అనుమతి విషయమై కూడా పెద్దిరెడ్డి స్పందించారు. రహదారి మంజూరు కోసం 2022లో అటవీ శాఖ అనుమతి ఇచ్చిందని, దీని వల్ల ఇతర రైతులకు కూడా ప్రయోజనం కలుగుతుందని వివరించారు. అయితే, కొన్ని మీడియా వర్గాలు ఈ విషయాన్ని వక్రీకరించి ఆరోపణలు చేస్తోన్నట్టు మండిపడ్డారు. చంద్రబాబు తప్పుడు ప్రచారంతో రాజకీయ ప్రయోజనాలు పొందాలని చూస్తున్నారని, తమపై తప్పుడు కథనాలు రాసిన మీడియా సంస్థలపై పరువునష్టం దావా వేస్తామని హెచ్చరించారు.
పవన్ కల్యాణ్, చంద్రబాబు తాను అక్రమ దందాలలో ఉన్నట్లు ఆరోపించడం అవాస్తవమని, నిజంగా ఎలాంటి అక్రమాలు జరిగి ఉంటే ఇప్పటివరకు ఏ చర్యలు తీసుకోలేదని నిలదీశారు. ఎర్రచందనం స్మగ్లింగ్ ఆరోపణలపై కూడా ఘాటుగా స్పందించిన ఆయన, దీనిపై ఇప్పటికే కోర్టులు క్లారిటీ ఇచ్చాయని స్పష్టం చేశారు. ప్రస్తుత ప్రభుత్వ హయాంలో అకారణ ఆరోపణలు చేస్తున్నారని, ప్రజలు ఈ కుట్రలను అర్థం చేసుకోవాలని సూచించారు. తాను ఎప్పటికీ నిజాయితీగా పనిచేస్తానని, ఎదుటివారి వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేందుకు తప్పుడు ఆరోపణలు చేయాల్సిన అవసరం తనకు లేదని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు.