2014 ఎన్నికల అనంతరం ముఖ్యమంత్రి అయిన చంద్రబాబుకు… రెండేళ్ల అనంతరమే బ్యాడ్ టైం స్టార్ట్ అయ్యిందని.. ఆ ఎఫెక్ట్ ఇప్పట్లో పోదని కామెంట్లు వినిపించిన సంగతి తెలిసిందే. ఇదే సమయంలో అమరావతి చేపట్టినప్పటినుంచీ బాబు పరిస్థితి మరీ దిగజారిపోయిందనేవారూ లేకపోలేదు. ఈ సమయంలో బాబు సొంత జిల్లాలో షాక్ తగిలింది.
అవును… ప్రస్తుతం రాయలసీమ జిల్లాల్లో పర్యటిస్తోన్న తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడుకి ఉమ్మడి చిత్తురు జిల్లాలో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఈ పర్యటనలో తొలుత కర్నూలు, నంద్యాల, కడప, అనంతపురం జిల్లాల్లో పర్యటించిన చంద్రబాబు… తాజాగా తన సొంత జిల్లా చిత్తూరులో అడుగుపెట్టారు.
ఈ సందర్భంగా పుంగనూరులో రోడ్ షో, బహిరంగ సభను నిర్వహించారు చంద్రబాబు. అవును… ఈ పర్యటనలో భాగంగా శుక్రవారం పుంగనూరుకు చేరుకున్నారు చంద్రబాబు. అధికార వైసీపీ సీనియర్ నేత, విద్యుత్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నియోజకవర్గం ఇది. వైసీపీకి ఇది కంచుకోట. ఈ నేపథ్యంలో పులివెందుల తరహాలోనే చంద్రబాబుకు ఇక్కడ కూడా నిరసన పర్వం ఎదురైంది.
చంద్రబాబు పుంగనూరులో పర్యటించిన నేపథ్యంలో స్థానిక వైసీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పుంగనూరులో నిరసన ప్రదర్శనలను నిర్వహించారు. నల్లజెండాలను ఎగురవేశారు. ఈ సందర్భంగాల్… “గో బ్యాక్ చంద్రబాబు” అంటూ ప్లకార్డులను ప్రదర్శించారు. చంద్రబాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ఈ క్రమంలో… చంద్రబాబు రాయలసీమ ద్రోహి అంటూ వైసీపీ కార్యకర్తలు పెద్దేత్తున నినాదాలు చేశారు. రాయలసీమకు మంజూరైన ఎయిమ్స్ వంటి కొన్ని భారీ ప్రాజెక్టులను సైతం అమరావతికి తరలించాడంటూ ధ్వజమెత్తారు. హంద్రీ-నీవా కోసం కేటాయించిన మోటార్ పంపులను కూడా పట్టిసీమ కోసం చంద్రబాబు ఎత్తుకెళ్లాడంటూ మండిపడ్డారు.
ఈ నేపథ్యంలో రాయలసీమలో ఒక్క నీటి ప్రాజెక్టుకు కూడా చంద్రబాబు శంకుస్థాపన చేయలేదని.. వాటిని ప్రారంభించిన దాఖలాలు కూడా లేవంటూ ఆరోపించిన స్థానికులు… ఇప్పుడు రాయలసీమ సంక్షేమం పేరుతో కొత్త నాటకానికి తెరతీశారంటూ తీవ్ర స్థాయిలో విమర్శించారు.
ఈ ఘటనలతో పుంగనూరు నియోజకవర్గంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు ముందుజాగ్రత్త చర్యలు తీసుకున్నారు. కాగా.. చంద్రబాబు రాయలసీమ జిల్లాల పర్యటన కామెడీ షోని తలపిస్తోందంటూ వైసీపీ నాయకులు కామెంట్ చేస్తోన్న సంగతి తెలిసిందే!