చూడు.. ఒకవైపే చూడు.. పవన్ దృష్టంతా ఇలానే?

తాను లక్షల పుస్తకాలు చదివినట్లు చెబుతుంటారు పవన్… మార్పుకోసమే తాను రాజకీయాల్లోకి వచ్చినట్లు చెబుతుంటారు… అయితే తన దృష్టి మాత్రం ఎప్పుడూ ఒకవైపే ఉండి ఆలోచిస్తుందని.. తనకు నచ్చని విషయం చూపించినా చూడలేని కబోదిలా పవన్ మారిపోతుంటారని కామెంట్లు వినిపిస్తుంటాయి. దానికి తాజాగా బలం చేకూర్చుకున్నారు పవన్!

అవును… పుంగ‌నూరులో చంద్రబాబును అడ్డుకోవ‌డమే ఆల‌స్యం… వెంట‌నే ఖండించ‌డానికి ప‌వ‌న్‌ క‌ల్యాణ్ ముందుకొచ్చారు. ఈ మేరకు ట్విట్టర్ లో ఒక ప్రకటన చేశారు. అక్కడ ఏమి జరిగింది.. ఎలా జరిగింది.. ఎందుకు జరిగింది అనే విషయాలను ఏమాత్రం అవగతం చేసుకోలేని పవన్… కేవలం ఒక వర్గం మీడియాలో.. అది కూడా అందులో నచ్చిన, తాను మెచ్చిన విషయాలను మాత్రమే స్పందించడం వివాదాస్పదమవుతుంది.

ఈ సందర్భంగా… “రాష్ట్రంలో వైసీపీ స‌ర్కార్ వైఖ‌రి ప్రతిప‌క్షం గొంతు నొక్కేలా వుంది. రాష్ట్రంలో అన్ని వ‌ర్గాల ప్రజ‌లు వైసీపీ నాయ‌కుల అరాచ‌కాల‌తో ఇబ్బందులు ప‌డుతున్నారు. ప్రజ‌ల త‌ర‌పున పోరాడ‌టం ప్రతిప‌క్షాల బాధ్యత‌. ఈ రోజు పుంగ‌నూరు నియోజ‌కవ‌ర్గంలో తెలుగుదేశం పార్టీ అధినేత‌, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప‌ర్యట‌న సంద‌ర్భంగా చోటు చేసుకున్న ప‌రిణామాలు వాంఛ‌నీయం కాదు”.

“ఆయ‌న ప‌ర్యట‌న‌ను అడ్డుకునేందుకు వైసీపీ వ్యక్తులు రాళ్ల దాడుల‌కు పాల్పడ‌టం, వాహ‌నాలు ధ్వంసం చేయ‌డం అధికార పార్టీ హింసా ప్రవృత్తిని తెలియ‌జేస్తోంది. వారిని నియంతృత్వం పెచ్చరిల్లుతోంది. పుంగ‌నూరులో చోటు చేసుకున్న ప‌రిణామాల‌ను ప్రజాస్వామ్యవాదులంద‌రూ ఖండించాలి” అని పవన్ తన ట్విట్టర్ ప్రకటనలో పేర్కొన్నారు.

ఇలా ఇచ్చిన పుంగ‌నూరు ఘ‌ట‌న‌పై ప‌వ‌న్‌ క‌ల్యాణ్ ఖండ‌న ప్రక‌ట‌న‌పై నెటిజ‌న్లు ఫైర్ అవుతున్నారు. త‌న తండ్రి సామాన్య పోలీస్ కానిస్టేబుల్ అని చెప్పుకునే ప‌వ‌న్‌ క‌ల్యాణ్‌.. పుంగ‌నూరులో పోలీసులే బాధితులుగా మిగిలితే, క‌నీసం సానుభూతి ప్ర‌క‌టించ‌ లేదు సరికదా… వారిపై దాడులకు యత్నించినవారికి అనుకూలంగా మాట్లాడుతున్నారంటూ ఫైరయ్యారు.

దీంతో… టీడీపీని అడ్డగోలుగా వెన‌కేసుకు రావ‌డానికి, ఫలితంగా ఓ ఘ‌ట‌న కావాలి. అంతే త‌ప్ప, త‌ప్పొప్పల‌తో త‌న‌కు సంబంధం లేద‌న్నట్టుగా ప‌వ‌న్ తీరు ఉందని అంటున్నారు. పోలీసు వాహనాన్ని టీడీపీ కార్యక‌ర్తలు త‌గ‌ల‌బెడుతున్నట్టు ఎల్లో ప‌త్రిక‌ల్లోనే ఫొటోల‌తో స‌హా ప్రచురించారు. అయినప్పటికీ ప‌వ‌న్ క‌ళ్లకు మాత్రం వైసీపీ వ్యక్తులే రాళ్ల దాడికి పాల్పడిన‌ట్టు, వాహ‌నాల‌ను ధ్వంసం చేసిన‌ట్టుగా క‌నిపిస్తోంది.

తాజాగా ఈ విషయాలపై పోలీసు అధికారుల సంఘం కూడా స్పందించింది. తన ఆవేదనను వ్యక్తం చేసింది. పోలీసులు కూడా మనుషులే అనే విషయం ప్రజాసంఘాలు, మానవహక్కుల సంఘాలు, ప్రజలు, నాయకులూ గుర్తించాలని ఆవేదనతో విన్నవించింది. పుంగనూరు ఘటనకు పూర్తిగా చంద్రబాబే కారణం అని ఆరోపించింది. చంద్రబాబు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది.

అవన్నీ పవన్ కంటికి కనిపించవు.. కారణం.. ఆయన ఒకవైపే చూస్తారు. దీంతో వైసీపీని విమ‌ర్శించ‌డ‌ము – టీడీపీని అడ్డంగా వెనకేసుకు రావడమే ప్రజాస్వామ్యమ‌ని ప‌వ‌న్ న‌మ్ముతున్నారా అని ప్రశ్నిస్తున్నారు. వాస్తవాలు మరిచి పవన్ ఇలా చూడూ.. ఒకవైపే చూడూ.. అని చంద్రబాబు ఆదేసించినట్లుగా ప్రవర్తిస్తే… జనసేన మనుగడకు ముందు ముందు చాలా ఇబ్బందులు తలెత్తుతాయని అంటున్నారు పరిశీలకులు.