వంగవీటి రాధా విషయంలో జగన్ సూచన ఇదే…

కొద్దిరోజుల క్రితం వంగవీటి రాధా ఇష్యూ సంచలనాత్మకంగా మారింది. జగన్ విజయవాడ సెంట్రల్ సీటు మల్లాది విష్ణుకి కేటాయించడంపై పెద్ద వివాదం చెలరేగింది. రాధా సెంట్రల్ సీటుపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అయితే కొన్ని రాజకీయ కారణాల రీత్యా జగన్ ఆ సీటును మల్లాది విష్ణుకి కేటాయించారు. ఆ విషయం రాజకీయ వర్గాల్లో తీవ్ర దుమారం రేపింది. రాధా అనుచరులు ఆగ్రహంతో ఆందోళన చేశారు. వంగవీటి రాధా సోదరుడు వంగవీటి శ్రీనివాస ప్రసాద్ అధిష్టానం నిర్ణయానికి నిరసన తెలుపుతూ పార్టీకి రాజీనామా కూడా చేశారు. అయితే ఈ అంశంపై బుధవారం పుంగనూరు వైసీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి స్పందించారు. రాధా పార్టీలో కొనసాగుతారో లేదో క్లారిటీ ఇచ్చారు. జగన్ ఈ విషయంపై రాధాతో గంటసేపు మాట్లాడినట్టు కూడా ఆయన తెలిపారు. జగన్ రాధాతో ఏం మాట్లాడారు? రాధా పార్టీలో కొనసాగుతారా లేదా? ఈ వివరాలు కింద ఉన్నాయి చదవండి.

బుధవారం టిడిపి ప్రభుత్వం ప్రవేశపెట్టిన యువనేస్తం పథకం గురించి పెద్దిరెడ్డి మీడియాతో మాట్లాడారు. యువనేస్తం పథకం యువతను నిరాశపరిచేలా ఉందన్నారు. ఎవరు అప్లికేషన్స్ కూడా పెట్టుకోలేదంటే ఈ పథకం ఎలా ఉందొ తెలుస్తోంది అన్నారు. ఆరు లక్షల అప్లికేషన్లు వచ్చాయని, అందులో ఒక లక్షా అరవై రెండువేల మంది మాత్రమే అర్హులు అని తేల్చారు టిడిపి ప్రభుత్వం. యువత నుండి పాజిటివ్ స్పందన లేని పథకం కోసం సుమారు 4 కోట్ల రూపాయలు ప్రచారానికి ఖర్చు చేసింది టిడిపి అని మండి పడ్డారు. ఎన్నికల ముందు ఓట్లు కొనుక్కోవడం కోసం ఈ పథకం ప్రవేశపెట్టారు అన్నారు. చంద్రబాబుకు ఎన్నికల ముందు రెండువేలు మూడువేల ఇవ్వడం అలవాటు. ఈసారి ఎన్నికల సమయానికి 6 వేలు ఇవ్వొచ్చులే అని ఈ పథకం ప్రవేశ పెట్టినట్టు ఉన్నారు అంటూ ఎద్దేవా చేశారు.

ఇదిలా ఉండగా మీడియా ఆయనను రాధా విషయం అడుగగా ఆయన ఈ విధంగా స్పందించారు. వంగవీటి రాధా పార్టీలోనే ఉన్నారు, కొనసాగుతారు కూడా… ఆయన పార్టీలో ఎందుకు ఉండరు అంటూ ప్రశ్నించారు. జగన్ స్వయంగా రాధాతో గంటసేపు చర్చించారు. రాధా పార్లమెంటు నుండి పోటీ చేసినా, శాసనసభ నుండి పోటీ చేస్తాను అని చెప్పినా ఒకే అన్నారు. “రాధా ఎక్కడ నుండి పోటీ చేసినా ఆయనకు పార్టీ తరపున అన్ని విధాలా మేము సహకరిస్తాము. మా నాయకుడు కూడా అదే సూచించారు. ఆయన పార్టీని వీడే ప్రసక్తే లేదు. ఆయన ఇప్పుడు ఏ హోదాలో ఉన్నారో అలానే పోటీ చేస్తారు”. ఎవరైతే పార్టీలో కో ఆర్డినేటర్లుగా ఉన్నారో, శాసనసభ్యులుగా ఉన్నారో వారంతా పోటీ చేస్తారు. వారే మా అభ్యర్థులు అని తెలిపారు పెద్దిరెడ్డి. ఒకటి రెండు మార్పులు జరగడం సాధ్యమే అన్నారు. చంద్రబాబు గుట్టు చప్పుడు కాకుండా అభ్యర్థుల్ని మారుస్తుంటే ఆయనని ఎందుకు ప్రశ్నించడం లేదని ప్రశ్నించారు.

ఇది పార్టీ ఇంటర్నల్ వ్యవహారం, అయినా… మీరు అడిగారు కాబట్టి చెబుతున్నాను. మేము కో ఆర్డినేటర్లను, అభ్యర్థులను ప్రకటించేది వాళ్ళు స్థానికంగా ఇంప్రూవ్ అవుతారని, బలపడతారని. ఆ తర్వాత సర్వేలు చేయించి మంచి గెలుపు గుర్రానికే సీటు ఇస్తాము. కొంతమందిని కో ఆర్డినేటర్లను నియమించాము, వారి పని తీరు సరిగా లేనప్పుడు మార్చకూడదు అంటే ఎలా అని ప్రశ్నించారు. “రాధా ఎక్కడ నుండి పోటీ చేసినా ఆయనకు పార్టీ తరపున అన్ని విధాలా మేము సహకరిస్తాము. మా నాయకుడు కూడా అదే చెప్పారు. ఆయన పార్టీని వీడే ప్రసక్తే లేదు. ఆయన ఇప్పుడు ఏ హోదాలో ఉన్నారో అలానే పోటీ చేస్తారు”. అంటూ పెద్దిరెడ్డి చేసిన వ్యాఖ్యలతో రాధా సెంట్రల్ నుండే పోటీ చేస్తారేమో అని పలువురు అభిప్రాయపడుతున్నారు.