ప్రధాని మోడీతో పవన్ కళ్యాణ్ భేటీ.! తర్వాతేంటి.?

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో విశాఖపట్నంలో నిన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భేటీ అయిన సంగతి తెలిసిందే. పది నిమిషాలు అనుకున్న మీటింగ్ కాస్తా, దాదాపు ముప్ఫయ్ ఐదు నిమిషాల పాటు జరిగింది. సాధారణంగా మీటింగ్ సమయం పొడిగింపు జరిగిందంటే.. విషయం పెద్దదే అయి వుండాలి.

ఏం జరిగింది.? అన్నది కేవలం ప్రధానికీ, జనసేనానికి మాత్రమే తెలుస్తుంది. ఎందుకంటే, అక్కడ జరిగింది వన్ టు వన్ మీటింగ్. జనసేనాని వెంట నాదెండ్ల మనోహర్ కూడా వున్నాగానీ, ఎక్కువగా మోడీ వన్ టు వన్ మీటింగులే నిర్వహిస్తుంటారు. అలా పవన్‌తో ప్రత్యేకంగా మోడీ చర్చించి వుంటారు. ఇందులో ఇంకో మాటకు తావు లేదు.

మీటింగ్ తర్వాత జనసేనాని బయటకు వచ్చి, తాను బస చేసిన నోవోటెల్‌కి చేరుకుని, అక్కడే మీడియాతో మాట్లాడారు. ‘మంచిరోజులు రాబోతున్నాయ్..’ అని చెప్పారు జనసేనాని. జనసేన దృష్టిలో మంచి రోజులు రావడమంటే, ఏపీలో వైసీపీ సర్కారు కూలిపోవడమే.! సో, ప్రధాని నుంచి ఆ దిశగా జనసేనానికి హామీ లభించినట్లుగా భావించొచ్చు.

ఇంకోపక్క, ఏపీ బీజేపీ ముఖ్య నేతలతోనూ ప్రధాని భేటీ అయ్యారు. ‘స్పీడు’ పెంచాలంటూ ఏపీ బీజేపీ నేతలకు, ప్రధాని మోడీ సూచించారు. గుజరాత్ మోడల్ అవలంభించాలంటూ దిశానిర్దేశం చేశారు. అటు పవన్‌తో భేటీ, ఇటు ఏపీ బీజేపీ నేతలకు దిశానిర్దేశం.. ఈ క్రమంలోనే ‘మంచి రోజులు రాబోతున్నాయ్..’ అని జనసేన చెప్పడం.. వెరసి, ముందు ముందు ఏపీ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలైతే చోటుచేసుకున్నాయి.

కాగా, నేడు ప్రధానితో సీఎం వైఎస్ జగన్ భేటీ అవనున్నారు. ప్రధానితో సీఎం జగన్ ఓ బహిరంగ సభలోనూ పాల్గొంటున్నారు. సో, ఈక్వేషన్ మళ్ళీ మారే అవకాశాలైతే లేకపోలేదు.

ప్రత్యేక హోదా సహా ఏ విషయంలోనూ బీజేపీపై, వైసీపీ నుంచి ఒత్తిడి లేదు. పైగా, పార్లమెంటులో అవసరమైనప్పుడల్లా వైసీపీ సహాయ సహకారాలు అందించింది. అలాంటప్పుడు, వైసీపీ మీద బీజేపీ ఎందుకు రాజకీయ వైరం పెంచుకోవాలి.? ఏమో, రాజకీయాల్లో ఏదైనా జరగొచ్చు.