కేసుల వల్లే జగన్ రోడ్లపై తిరిగారా ?

తనపై ఉన్న కేసుల వల్లే జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర పేరుతో రోడ్లపై తిరిగారా ? జనసేన అధినేత పవన్ కల్యాణ్ తాజాగా చేసిన ఆరోపణలు అలాగే ఉన్నాయి.  చంద్రబాబునాయుడు, లోకేష్, నరేంద్రమోడి ఎవ్వరూ రోడ్లపైన తిరగలేదని చెప్పారు. ఒక్క జగన్ మాత్రమే రోడ్లపైన తిరిగారంటే అందుకు ఆయనపై ఉన్న కేసులే కారణమంటూ పవన్ కొత్త థియరీ చెప్పుకొచ్చారు.

నిజానికి పవన్ ఇంత చీప్ గా మాట్లాడుతారని ఎవ్వరూ అనుకోలేదు. కేసులున్నందు వల్లే జగన్ పాదయాత్ర చేసినట్లు ఏ లెక్క ప్రకారం పవన్ చెప్పారో అర్ధం కావటం లేదు. పవన్ చెప్పిన థియరీనే కరెక్టయితే మరి దివంగత నేత వైఎస్సార్ ఎందుకు పాదయాత్ర చేసినట్లు ? ఆయనపై ఏమీ కేసులు లేవే ?

వైఎస్సార్ మృతి, జగన్ ను జైలులో పెట్టినపుడు సోదరి వైఎస్ షర్మిల కూడా పాదయాత్ర చేశారు కదా. ఆమెపై ఏమీ కేసులు లేవే ? మరి షర్మిల ఎందుకు పాదయాత్ర చేసినట్లు ? అదే సమయంలో చంద్రబాబు చేసిన పాదయాత్ర కూడా కేసుల భయంతోనే చేశారా ? పతన్ తాజా వ్యాఖ్యలు చూస్తుంటే ఆయనలోని రాజకీయ అపరిపక్వత బయటపడుతోంది.

జనాల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు, జనాలతో నేరుగా మమేకమయ్యేందుకు నేతలకు పాదయాత్రకు మించిన మార్గం మరోటి లేదు. పాదయాత్ర అనుకున్నంత సులభంకాదు చేయటం. పాదయాత్ర చేయాలంటే ముందు సదరు నేతలు మానసికంగా చాలా ధృడంగా ఉండటంతో పాటు ఆరోగ్యం కూడా కలిసిరావాలి. అందుకనే చాలామంది నేతలు పాదయాత్ర జోలికి వెళ్ళరు. ఈ విషయాలే తెలీకుండా పాదయాత్ర గురించి పవన్ చీప్ గా మాట్లాడటం ఆయన స్ధాయికి తగదనే చెప్పాలి.