ముందస్తు ఎఫెక్ట్: పవన్ మొదలుపెట్టబోయేది ఎక్కడనుంచంటే…!

హస్తిన పర్యటన ముగించుకుని జగన్ ఏపీకి రావడంతోనే ముందస్తు ఎన్నికల ఊహాగానాలు పెద్ద ఎత్తున చెలరేగాయి. జగన్ ముందస్తుకు రావడానికి కేంద్ర ప్రభుత్వం సిగ్నల్ ఇచ్చిందని.. అందుకు జగన్ సై అన్నారని.. అందులో భాగంగా డిశెంబరులోనే ఏపీలో ఎన్నికలు రాబోతున్నాయని రకరకాల కథనాలు వినిపిస్తున్నాయి. దీంతో… జనసేన అధినేత అలర్ట్ అయ్యారు. ఏపీలో టూర్ షెడ్యూల్ కు రంగం సిద్ధం చేసుకుంటున్నారు.

ఏపీలో ముందస్తు ఎన్నికల సందడి మొదలైంది. ఇప్పటికే పవన్ ప్రమేయం లేకుండా.. జనసేన ప్రస్థావన లేకుండా.. మహానాడు ముగించేసిన చంద్రబాబు.. అదే వేదికపై మొదటి విడత మ్యానిఫేస్టోని విడుదల చేశారు. ఆ విధంగా ముందస్తు ఎన్నికలకు సన్నదం అవుతున్నారు. ఇక జగన్ అయితే… వరుసపెట్టి జిల్లాల పర్యటనలు చేస్తున్నారు. వరుసపెట్టి బహిరంగ సభల్లో పాల్గొంటూ ప్రజలకు ముందస్తు సంకేతాలు ఇస్తున్నారు.

దీంతో ఇప్పటికే కమిట్ అయిన సినిమాలకు కాస్త విరామం ప్రకటించి.. వారాహి రధమేసుకుని జనసేనాని రోడ్ల మీదకు రాబోతున్నారని తెలుస్తుంది. దీనికి సంబంధించి రూట్ మ్యాప్ ని ఖరారు చేసే పనిలో ఆ పార్టీ ఉందని సమాచారం. అయితే ఈ యాత్రం గుంటూరు, కృష్ణా, రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాలనుంచి కాకుండా.. ఈసారి తనకు బలమున్న గోదావరి జిల్లాల నుంచి ప్రారంభించాలని సేనాని భావిస్తున్నారంట. వీలైనంత తొందర్లోనే ఈ యాత్ర ఉంటుందని అంటున్నారు!

జనసేనకు ఉభయ గోదావరి జిల్లాలలో 36 శాతానికి పైగా బలం ఉందని అంచనా వేస్తున్న జనసేనాని… తాజా సర్వే రిపోర్టులు కూడా ఇదే విషయాన్ని దృవీకరించాయని చెబుతున్నారు. దీంతో… అంతబలమున్న గోదావరి జిల్లాల్లోనే ఎక్కువ కాన్ సంట్రేషన్ చెయ్యాలని ఫిక్సయ్యారంట. దీంతో… తన వారాహి యాత్రను రెండు ఉమ్మడి గోదావరి జిల్లాల్లోనే అధిక సమయం తిప్పాలని.. అనంతరం అలా ఉత్తరాంధ్రలో ప్రవేశించాలని భావిస్తున్నట్లు సమాచారం.

అయితే ఈ యాత్ర ప్రారంభమయ్యే లోపే పొత్తు విషయంపై చంద్రబాబుతో కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టించడంతోపాటు… సీట్ల విషయంలో కూడా ఒక క్లారిటీ తీసుకుంటే బెటరని సూచిస్తున్నారు పరిశీలకులు. అలాకాకుండా చివరి నిమిషం వరకూ పనికిరాని సస్పెన్స్ మెయింటైన్ చేస్తే… మొదటికే మోసం వస్తోందని, కేడర్ ను కూల్ చేయడం కష్టమని హెచ్చరిస్తున్నారు. మరి పవన్ ఈ మేరకు ఈ మాటలు వింటారా.. లేక, తనకు తెలిసిన రాజకీయంతో ముందుకు పోతారా అన్నది వేచి చూడాలి.